ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థలో కొన్ని కీలక మార్పులు తీసుకు వచ్చేందుకు కృషి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో నూతన విద్యా విధానం అమలులో భాగంగా ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతుల విద్యార్థులను సమీపంలో వున్న ఉన్నత పాఠశాలల్లో చేర్చాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా విద్యా శాఖ అధికారులు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఏపీలో దసరా పండుగ తర్వాత వేలాది ప్రాథమిక పాఠశాలల నుంచి 3 నుంచి 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయనున్నారు. 250 మీటర్లలోపు ఉన్న ప్రాథమిక పాఠశాలల్లోని 3,4,5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయనున్నారు. వాస్తవానికి ఈ ప్రక్రియ విద్యాసంవత్సరం ప్రారంభంలో చేయాల్సి ఉన్నా.. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే ఇబ్బందులను ఇప్పటి వరకు పరిశీలించడంతో సాధ్యం కాలేదు.
ఇక దసరా సెలవుల తర్వాత రాష్ట్రంలోని 3,627 ప్రాథమిక పాఠశాలల్లోని 3,4,5 తరగతులను 3,178 ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయాలని నిర్ణయించారు. కాకపోతే ఎక్కడైనా ఉన్న పాఠశాలల్లో భవనాల కొరత ఉన్నట్లయితే.. ప్రాథమిక పాఠశాలల్లోని విద్యార్థులను అక్కడే ఉంచి ఆయా పాఠ్యాంశాలను ఉపాధ్యాయులతో బోధించాలని నిర్ణయించారు.