మన దేశంలో విద్యా వ్యవస్థ కునారిల్లుతోందని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా సర్కారు బడుల్లో కనీస వసతులు లేక, విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులు లేక దయనీయ పరిస్థితుల్లో స్కూళ్లు మగ్గిపోతున్నాయి.
మన దేశంలో సరైన విద్య అందక ఇప్పటికీ ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేటు స్కూళ్లకు వెళ్దామంటే లక్షలకు లక్షలు ఫీజు కట్టలేని పరిస్థితి. అదే సర్కారు బడికి వెళ్తే అక్కడ వసతులు సరిగ్గా ఉండవు. వందల మంది విద్యార్థులకు ఒకరిద్దరు ఉపాధ్యాయులే ఉంటారు. ఒక్కో విద్యార్థిపై స్పెషల్ ఫోకస్ పెట్టి చదివించడం వీలుకాదు. దీంతో చాలా మంది సమస్యలు ఎదుర్కొంటున్నారు. నేటి విద్యార్థులే రేపటి దేశ భవిష్యత్తు అని అంటుంటారు. కానీ గుజరాత్లో మాత్రం పరిస్థితులు ఇలా లేవు. సరిపడా టీచర్లు లేకపోవడంతో పిల్లలకు సరైన విద్య అందక అక్కడ ప్రాథమిక పాఠశాల వ్యవస్థ కునారిల్లుతోంది.
ప్రధాని మోడీ స్వరాష్ట్రంలో 906 బడులు కేవలం ఒక్క ఉపాధ్యాయుడితో నడుస్తున్నాయి. దీన్ని బట్టే అక్కడి పరిస్థితులను అర్థం చేసుకోవచ్చు. గుజరాత్‌లోని స్కూళ్ల పరిస్థితిపై క్షేత్రస్థాయి పరిశీలన చేసిన ప్రముఖ హిందీ పత్రిక దైనిక్ భాస్కర్ పలు సంచలన విషయాలను వెల్లడించింది. అక్కడి ప్రైమరీ స్కూళ్లలో ఐదు తరగతుల పిల్లలకు కలిపి ఒక్క టీచరే పాఠాలు చెప్పాల్సి వస్తోందట. దీంతో పిల్లలకు పాఠాలు సరిగ్గా బోధపడటం లేదు. మూడో తరగతికి వచ్చినా కొంత మంది పిల్లలు అక్షరాలు రాయడం, చదవడం రాని పరిస్థితిలో ఉన్నారని దైనిక్ భాస్కర్ పేర్కొంది. గుజరాత్‌లోని 33 జిల్లాల్లో 906 పాఠశాలల్లో 5 తరగతులకు గానూ కేవలం ఒక్క టీచరే పనిచేస్తున్నారు.
విద్యాశాఖ మంత్రి సొంత డిస్ట్రిక్ట్‌లో అయితే 102 స్కూళ్లలో ఒకే ఉపాధ్యాయుడు ఉన్నారట. ఈ విషయాన్ని గుజరాత్ ప్రభుత్వమే పేర్కొందని సమాచారం. అన్ని తరగతుల విద్యార్థులను కలిపి ఒకే గదిలో కూర్చోబెట్టి బోధించడం వల్ల వారికి పాఠాలు అర్థం కావడం లేదని టీచర్లే చెబుతున్నారు. మొత్తంగా టీచర్ల కొరతతో గుజరాత్లో ప్రాథమిక విద్య అస్తవ్యస్తంగా తయారైందని విమర్శలు వస్తున్నాయి. కొన్ని పాఠశాలల్లో అయితే మధ్యాహ్న భోజన వంటమనిషే స్టూడెంట్స్‌కు పాఠాలు చెబుతున్నట్లు దైనిక్ భాస్కర్ పరిశీలనలో తేలింది. మరి.. 906 బడుల్లో ఒకే టీచర్ ఉండటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.