త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ (63), ఆయన భార్య మధులిక సహా 14 మంది ప్రయాణిస్తున్న హెలికాప్టర్ తమిళనాడులోని నీలగిరి జిల్లా కన్నూర్ సమీపంలో కూలిన ఘటనలో 13 మంది దుర్మణం పాలయిన ఘటన యావత్ భారతాన్ని కన్నీటిపర్యంతం చేసింది. ఈ ప్రమాదంలో గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ ప్రాణాలతో బయటపడ్డారు. అయితే, ఆయన పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో చిత్తూరు జిల్లా కురుబకోట మండలం ఎగువరేగడ గ్రామానికి చెందిన సాయి తేజ(29) దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా కురబలకోట మండలం ఎగువరేగడ గ్రామంలోనూ విషాదం నింపింది. సీడీఎస్ బిపిన్ రావత్‌కు వ్యక్తిగత భద్రతా అధికారిగా సాయితేజ్ విధులు నిర్విహిస్తున్నారు.
కురబలకోట మండలం ఎగువరేగడకు చెందిన మోహన్, భువనేశ్వరి దంపతుల పెద్ద కుమారుడైన సాయితేజ 2012లో ఆర్మీ సిపాయిగా బెంగళూరు రెజిమెంట్ నుంచి ఎంపికయ్యారు. కొంతకాలం జమ్ము కశ్మీర్లో విధులు నిర్వర్తించారు. ఏడాది తర్వాత పారా కమాండో పరీక్ష రాసి ఉత్తీర్ణుడయ్యారు. ఆకాశమార్గంలో నేరుగా శత్రుస్థావరాలకే వెళ్లి, వారిని మట్టి కరిపించే పారా ట్రూపర్‌గా ఎదిగి అందరిచే షభాష్ అనిపించుకున్నాడు. ఇందుకోసం కఠోర శిక్షణ పొందారు. మెరుపుదాడులు చేయడంలో దిట్టలైన వీరికి సైన్యంలో ప్రత్యేక స్థానం ఉంది. పారా కమాండోగా బెంగళూరుతో పాటు వివిధ వాతావరణ పరిస్థితుల్లో రాటుదేలారు. తక్కువ కాలంలోనే సాయితేజ కొత్తగా వచ్చే పారా కమాండోలకు శిక్షణ ఇచ్చే స్థాయికి చేరుకున్నారు.
ఈ నేపథ్యంలోనే త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ ఆయనలోని శక్తిసామర్థ్యాలను గుర్తించి.. తన వ్యక్తిగత భద్రతా సిబ్బందిలో ఒకరిగా నియమించుకున్నారు. నేరుగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌కే నమ్మకమైన భద్రతాధికారిగా ఎదిగారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్‌ను మెప్పించి ఆయన వెన్నంటి ఉండేవారు. బిపిన్ రావత్ ఆయనను చాలా అభిమానించేవారని స్నేహితులు అంటున్నారు.
సాయితేజ్‌కు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. భార్య పేరు శ్యామల. కొడుకు మోక్షజ్ఞ,కూతురు దర్శిని. సాయితేజ ప్రోత్సాహంతో తన తమ్ముడు మహేష్ బాబు కూడా సైన్యంలో చేరాడు. ప్రస్తుతం అతడు సిక్కింలో విధులు నిర్వహిస్తున్నారు. సాయితేజ ఆకస్మికమరణంతో తల్లిదండ్రులు, భార్య కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఆయన మరణం ఒక్క చిత్తూరు జిల్లా వాసులనే కాదు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను బాధలో ముంచేసింది. దేశ సేవకు తన జీవితాన్ని అంకితం చేసిన సాయితేజకు ఘననివాళి అర్పిస్తున్నారు ప్రజలు.