Virata Parvam Review Rating in Telugu: సాయి పల్లవి- రానా జంటగా నటించిన విరాటపర్వం సినిమా ఎట్టకేలకు విడుదల అయ్యింది. 2019లో మొదలై.. 2020 డిసెంబరు నాటికి షూటింగ్ పూర్తి చేసుకున్నా కూడా.. కరోనా కారణంగా 2022 వరకు ఆగాల్సి వచ్చింది. మొదట 2021 ఏప్రిల్ 30 విడుదల ప్రకటించినా అది కూడా వాయిదా పడింది. మరి.. మోస్ట్ అవైటెడ్.. పోస్ట్ పోన్డ్ విరాటపర్వం మూవీ కథేంటి? సినిమా ఎలా ఉంది? ఎవరెలా నటించారో చూసేద్దాం.
1990ల్లో తెలంగాణ ప్రాంతంలో జరిగిన కొన్ని యధార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రమే విరాటపర్వం. ఆ సమయంలో సమాజంపై నక్సలైట్ల ప్రభావం ఎలా ఉండేది? అసలు ప్రజలు పోలీసులను, ప్రభుత్వాలను కాదని అన్నలను ఎందుకు సహాయం కోరుతున్నారు? ప్రభుత్వానికి సవాలుగా మారిన నక్సల్స్ ని కంట్రోల్ చేయడంలో పోలీసులు ఎంత మేర సక్సెస్ అయ్యారు.. అందుకు ఎలాంటి దారులు ఎంచుకున్నారు అనేదే కథ. ఈ కథ నేపథ్యంలోనే వెన్నెల(సాయి పల్లవి)కు దళ కమాండర్ రవన్న(రానా)పై ప్రేమ పుట్టడం జరుగుతుంది. అయితే తనలో పుట్టిన ప్రేమను రానాకు తెలియజేసిందా? అందుకు రానా ఒప్పుకున్నాడా? అసలు వారి మధ్య ఏం జరిగింది అనేది మీరు తెర మీద చాడాల్సిందే.
నక్సల్ బ్యాక్ డ్రాప్ లో ఒక లవ్ స్టోరీని తెరకెక్కించడం అనేది అనుకోవడానికి బాగానే ఉన్నా.. అది ఒక సాహసమనే చెప్పాలి. డైరెక్టర్ వేణు ఊడుగుల.. తాను అనుకున్న కథను అనుకున్నట్లుగా తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యాడు. అప్పట్లో జరిగిన ఎన్నో అణచివేతలు, కులం, వర్గం, వర్ణం పేరుతో జరిగిన దాడులను గుర్తు చేస్తూనే.. ప్రేక్షకులకు ఒక అందమైన ప్రేమ కథను చెప్పుకొచ్చాడు. మనసులో ఒకటి అనుకుంటే అది చేయడానికి ఎంతకైనా తెగించే ఒక మొండి, తెలివైన, చలాకీ అమ్మాయి వెన్నెల(సాయి పల్లవి). సమాజంలో జరుగుతున్న అణచివేతలు, పోలీసులు, ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు చూసి విసిగిపోయి అన్నల్లో కలిసిపోతాడు డాక్టర్ రవి శంకర్ అలియాస్ రవన్న(రానా). ఇద్దరివీ భిన్నమైన లోకాలు.. విభిన్నమైన ప్రపంచాలు. వెన్నెల.. ఒక ఫ్రెండ్ ఇచ్చిన పుస్తకం చదివి నక్సలైట్ దళ కమాండర్ రవన్నను ప్రేమించడం ప్రారంభిస్తుంది. తన ప్రేమ కోసం వెన్నెల ఎన్ని కష్టాలు పడింది, రవన్నను ఎలా కలిసింది, వారి ప్రేమ సక్సెస్ అయ్యిందా లేదా అనేది మాత్రం తెర మీద చూడాల్సిందే.
ప్రేమ అనేది ఒక అద్భుతమైన భావన.. దానికి భాష, వయసు, వర్గం, వర్ణంతో సంబంధం లేదు. ఒక అమ్మాయి, అబ్బాయిల మధ్య కలిగేదే ప్రేమ అనుకోవడం పొరపాటు. ఒక కొడుకుపై తల్లికి ఉండేది, ఒక కూతురిపై తండ్రికి ఉండేది కూడా ప్రేమే. యువతీ యువకుల మధ్య ఉండే ప్రేమను మాత్రమే కాకుండా.. పిల్లలు- తల్లిందండ్రుల నడుమ ఉండే బంధాన్ని కూడా ఎంతో చక్కగా తెరకెక్కించారు. కథతో పాటు ప్రేక్షకులను నడిపిన తీరు బాగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ప్రేమను డైరెక్టర్ వర్ణించిన తీరు, చూపించిన సందర్భాన్ని మెచ్చుకోవాలి. ఒకే కథలో ప్రేమ దైవంతో సమానం అని చెప్పాడు.. అదే కథలో ప్రేమ అనేది అబద్ధం అన్నాడు.. మళ్లీ అవసరాల కోసం ఎదుటివారిని మోసం చేసేందుకు మాత్రమే ప్రేమ అనే పదాన్ని వాడతారు అన్నాడు. కానీ, ప్రతి సందర్భంలో ప్రేమకు కొత్త అర్థం చెబుతూనే.. తన మాటను సమర్థించుకోగలిగాడు.
పోలీసుల జులుం, బూటకపు ఎన్ కౌంటర్లు, పోలీసుల ప్రవర్తనను ఎండగడుతూనే.. అటు నక్సలైట్ల తీరును కూడా ప్రశ్నించాడు. అందరూ సమాజం కోసమే అన్నలుగా మారరు అనే వాదనను కూడా కథలో టచ్ చేశాడు. రక్తానికి రక్తమే సమాధానం కాదని చెప్పాలని ప్రయత్నించాడు. ఈ సినిమాని ప్రధానంగా ప్రేమ కథగానే చూపించాడు. ఏ విషయాన్ని మరీ లాగి లాగి సాగదీయలేదు.. అలాగని ఏ విషయాన్ని టచ్ చేయకుండా వదల లేదు. ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడా లాగ్ అనిపించినా ప్రేక్షకుడు కథతోనే ఎంగేజ్ అయ్యి ఉండేలా చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. సమాజంపై బాధ్యతతో ఏదో సాధించేయాలి, సమాజాన్ని కడిగేయాలి అని కన్న తల్లిందండ్రులను, కట్టుకున్న వారిని వదిలేసి అడవులు పట్టుకునిపోతే ఇంటి దగ్గర ఉన్నవారు ఎంత నరక యాతన అనుభవిస్తారో చెప్పిన తీరు ఆకట్టుకుంటుంది.
ఈ సినిమాలో ప్రతి ఒక్క ఆర్టిస్ట్ తమ బెస్ట్ ఇచ్చారు. సాయి పల్లవి- రానా నటన సినిమాకే హైలెట్ గా నిలుస్తుంది. నిజానికి కొన్ని సీన్లలో సాయి పల్లవి.. రానానే డామినేట్ చేసిందనిపిస్తుంది. నిజంగానే లేడీ పవర్ స్టార్ అనిపించేసుకుంది. రానా ఎప్పటిలాగానే తన పాత్రకు నూరు శాతం న్యాయం చేశాడు. సమాజంపై కోపం, అసంతృప్తి, ఆవేదన, వెన్నెలపై ప్రేమ, తల్లిపై అనురాగం ఇలా అన్ని ఎమోషన్స్ రానా నటనలో స్పష్టంగా కనిపిస్తాయి. కూతురుని అమితంగా ప్రేమించే తండ్రి పాత్రలో సాయి చంద్ ఒదిగిపోయాడు. ఫిదా సినిమాలో కాంబో మళ్లీ రిపీట్ కావడంతో వారి మధ్య నిజమైన తండ్రీ కూతుళ్ల ఆప్యాయతను చూడగలుగుతారు.
ఈశ్వరీరావు కూడా పాత్రకు తగ్గట్లు తన పరిధిలో నటించింది. నక్సలైట్లపై యుద్ధం చేసే పోలీసు అధికారి పాత్రలో బెనర్జీ జీవించేశాడు. రాహుల్ రామకృష్ణ, నవీన్ చంద్ర, ప్రియమణి, నందితా దాస్, జరీనా వహాబ్, నివేదితా పేతురాజ్ అంతా తమ పాత్రలకు న్యాయం చేశారు.
విరాటపర్వం సినిమాతో వేణు ఊడుగుల మంచి డైరెక్టర్ అనే పేరు సంపాదించుకున్నాడు. అంతేకాకుండా వేణు ఊడుగుల పెన్ పవర్, స్టోరీ టెల్లింగ్ ఈ సినిమాతో మరింత బలంగా తెలుస్తాయి. ఎడిటర్ గా ఎన్నో అవార్డులు అందుకున్న శ్రీకర్ ప్రసాద్ తన మార్క్ ఎడిటింగ్ తో మళ్లీ ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులు కొట్టేశారు. నిడివి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అక్కడ అక్కడ తప్పితే సినిమాలో ఎక్కడా పెద్ద లాగ్ అనిపించదు. సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే అడవి అందాలను, తెలంగాణ పల్లెటూరి సోయగాలను డానీ సాంచెజ్ లోపెజ్, తివాకర్ మణి చూపించిన తీరు కట్టిపడేస్తుంది.
సురేశ్ బొబ్బిలి అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. యాక్షన్ సీక్వెన్స్ లో సురేశ్ అందించిన ఆర్ఆర్ అలరిస్తుంది. సినిమా నిర్మాణ విలువలు కూడా ఎంతగానో ఆకట్టుకుంటాయి. నిర్మాతలు సినిమా విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. ప్రతి సీను, ప్రతి షాటు ఎంతో రిచ్ గా ఉంటాయి.
రానా, సాయి పల్లివి
ఎడిటింగ్
బ్యాగ్రౌండ్
ఫస్ట్ హాఫ్ లో కాస్త లాగ్ సీన్లు
చివరి మాట: విరాటపర్వం.. నక్సల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన నిజమైన ప్రేమకథ.
గమనిక: ఈ రివ్యూ.. సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.