తెలంగాణ దొరల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ‘రుద్రంగి’. ఇటీవల కాలంలో ఈ నేపథ్యంలో లవ్, ఫ్యామిలీ స్టోరీస్ తీశారు కానీ దొరల బ్యాక్‌డ్రాప్ మాత్రం ఎవరూ టచ్ చెయ్యలేదు. చిన్నతనంలో తాను చూసిన సంఘటనల ఆధారంగా దర్శకుడు అజయ్ సామ్రాట్ ఈ కథ రాసుకున్నాడు.
తెలంగాణా నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రాలు, స్టార్ హీరోలు తెలంగాణ యాస పలుకుతున్న సినిమాలు ఘన విజయం సాధిస్తున్నాయి. ఎంచుకున్న నేపథ్యాన్ని చక్కగా తెరపై ఆవిష్కరించి సక్సెస్ అవుతున్నారు మేకర్స్. అయితే ఈసారి తెలంగాణ దొరల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ‘రుద్రంగి’. ఇటీవల కాలంలో ఈ నేపథ్యంలో లవ్, ఫ్యామిలీ స్టోరీస్ తీశారు కానీ దొరల బ్యాక్‌డ్రాప్ మాత్రం ఎవరూ టచ్ చెయ్యలేదు. చిన్నతనంలో తాను చూసిన సంఘటనల ఆధారంగా దర్శకుడు అజయ్ సామ్రాట్ ఈ కథ రాసుకున్నాడు. జగపతి బాబు, విమలా రామన్, మమతా మోహన్ దాస్, గానవి లక్ష్మణ్, ఆశిష్ గాంధీ తదితరులు ప్రధాన పాత్రధారులుగా, అజయ్ సామ్రామట్ దర్శకత్వంలో, రసమయి బాలకిషన్ భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘రుద్రంగి’ ఈ శుక్రవారం (జూలై 7) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
కథ:
రుద్రంగి సంస్థానంలో నివసించే బావా మరదళ్లు అయిన మల్లేష్ (ఆశిష్ గాంధీ), రుద్రంగి (గనవి లక్ష్మణ్) చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోవడంతో తాత దగ్గర పెరుగుతారు. ఎక్కువ రోజులు బ్రతకనని భావించిన తాత, చిన్నతనంలోనే మల్లేష్ చేత రుద్రంగి మెడలో తాళి కట్టించి, ఒకరినొకరు వదలకూడదని మాట తీసుకుంటాడు. దొర (ప్రభాకర్) పనికి పిలిస్తే రాకపోవడంతో వారి తాతని పాలేరులతో ఈడ్చుకొచ్చి కొట్టి చంపేస్తాడు. కోపంతో దొరని రాయితో కొట్టి, రుద్రంగిని తీసుకుని పారిపోయిన మల్లేష్.. మరో దొర భీమ్ రావ్ దేశ్‌ముఖ్ (జగపతి బాబు) ని కాపాడి అతని దగ్గరే పాలేరుగా పని చేస్తుంటాడు. పెద్దయ్యాక దొరతో కలిసి చిన్నప్పుడు తన తాతను చంపిన దొరను అంతం చేస్తాడు.
ఇక ఆడవాళ్లంటే తెగ మోజు పడే భీమ్ రావ్ దొర భార్య మీరా భాయ్ (విమలా రామన్) గర్భవతిగా ఉండగా.. దొర బిడ్డ జ్వాలా భాయ్ (మమతా మోహన్ దాస్) ని రెండో పెళ్లాంగా తెచ్చుకుంటాడు. కానీ ఆమెలో ఆడతనం కనిపించకపోవడంతో పట్టించుకోడు. ఓ రోజు అడవిలో రుద్రంగిని చూసి పిచ్చోడయిపోతాడు దొర. ఆమెను తీసుకురమ్మని మల్లేష్‌కి చెప్తాడు. రుద్రంగి తన భార్య అని, చిన్నతనంలోనే పెళ్లి జరిగిందని చెప్పడంతో వదిలేస్తాడు. తర్వాత ఇంకో మెలిక పెడతాడు. కాగా జ్వాలా భాయ్, మల్లేష్ మీద మనసు పడుతుంది. ఒకానొక టైంలో రుద్రంగి, మల్లేష్ ఆ ప్రాంతం విడిచి పారిపోతారు. దీంతో వారి ఆచూకీ చెప్పాలంటూ దొర ఊరి జనాలను నానా హింసలు పెడుతుంటాడు. చివరకి రుద్రంగి, మల్లేష్ ఇద్దరు దొరకు దొరికారా?.. దొర కోరిక తీరిందా?, రుద్రంగి సంస్థానం ఏమైంది? అనేది మిగతా కథ..
1947లో ఇండియాకి స్వాతంత్ర్యం వచ్చింది కానీ తెలంగాణకు స్వాతంత్ర్యం రాలేదు. నైజాం అరాచకాలకు, దొరల బానిసత్వానికి తెలంగాణ పల్లెలు అణచివేయబడుతూనే ఉన్నాయి. బానిస సంకెళ్ల నడుమ తెలంగాణ ఊర్లు జీవనం సాగించాల్సిన పరిస్థితి. ‘రుద్రంగి’ సినిమాలోనూ అదే కథని చూపించారు. రుద్రంగి అనే సంస్థానంలో ఉండే దొర నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. అయితే దొరలు అంటే అందమైన అమ్మాయిలు కనిపిస్తే చాలు తమ గడీలకు పిలిపించుకుని వారిని బలవంతంగా అనుభవించేవారు. కొత్తగా పెళ్లైనా వదిలే వాళ్లు కాదు. ఎదురు తిరిగితే వాళ్ల భర్తలను చంపేవారు. అలా దొరల అరాచకాలకు అడ్డే ఉండేది కాదు. ఈ సినిమాలో అలాంటి ఎలిమెంట్స్‌నే టచ్ చేశారు దర్శకుడు. అలాగే రుద్రంగికి కావల్సింది గడీలు కాదు, బడులు అనే సందేశాన్ని కూడా చెప్పాడు. దీనికి తోడు కథని నడిపించే విధానంలో కొత్తదనం పాటించాడు.
భీమ్ రావ్ దేశ్‌ముఖ్ పాత్రలో జగపతి బాబుని తప్ప మరో నటుడిని ఊహించలేం. ఆయన ఆహార్యం, డైలాగ్ డెలివరీ, దొరగా రాజసం ఒలికించిన తీరు అద్బుతం. విమలా రామన్ తన పాత్రలో మంచి నటన కనబర్చింది. మమతా మోహన్ దాస్ జ్వాలా భాయ్‌గా చెలరేగిపోయింది. ఆశిష్ గాంధీ నటన, యాక్షన్ సీన్లలో మెప్పించాడు. గనవిది ఇంపార్టెంట్ క్యారెక్టర్. రుద్రంగిగా తన నటనతో అలరించింది. మిగతా నటీనటులంతా తమ పాత్రల పరిధిమేర చేశారు.
సాంకేతిక నిపుణులంతా ఈ సినిమా కోసం మంచి ఎఫర్ట్ పెట్టారు. నవ్ పాల్ రాజా పాటలు పర్వాదేలనిపించినా, నేపథ్య సంగీతంతో ఆకట్టుకున్నాడు. సంతోష్ సినిమాటోగ్రఫీ మూవీకి మరింత అందం తీసుకొచ్చింది. ఎడిటింగ్ ఇంకొంచెం క్రిస్పీగా ఉంటే బాగుండనిపిస్తుంది. ముఖ్యంగా ఇలాంటి కథకు ఆర్ట్, కాస్ట్యూమ్ డిపార్ట్‌మెంట్స్ మెయిన్ పిల్లర్స్ అని చెప్పొచ్చు. వారు కూడా బాగా వర్క్ చేశారు.
చివరి మాట: తెలంగాణ దొరల నేపథ్యాన్ని సరికొత్తగా ఆవిష్కరించిన సినిమా ‘రుద్రంగి’
రేటింగ్: 2.5/5