శివ కార్తికేయన్, అదితి శంకర్ (దర్శకుడు శంకర్ కుమార్తె), సీనియర్ నటి సరిత, సునీల్, యోగిబాబు, మిస్కిన్ తదితరులు నటించిన సినిమా ‘మహావీరుడు’ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
తమిళనాట స్టార్ హీరోగా కొనసాగుతున్న శివ కార్తికేయన్, ‘రెమో’, ‘సీమరాజా’, ‘డాక్టర్’, ‘డాన్’ వంటి సినిమాలతో తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇంతకుముందు చేసిన బైలింగ్వల్ ఫిలిం ‘ప్రిన్స్’ అనుకున్నంతగా ఆడలేదు. దీంతో తర్వాత సినిమా మీదే ఫోకస్ పెట్టాడు. శివ కార్తికేయన్, అదితి శంకర్ (దర్శకుడు శంకర్ కుమార్తె), సీనియర్ నటి సరిత, సునీల్, యోగిబాబు, మిస్కిన్ (డైరెక్టర్) తదితరులు నటించిన సినిమా ‘మావీరన్’. ‘మండేలా’ మూవీతో ఆకట్టుకున్న మడోన్ అశ్విన్ దర్శకుడు. ఏషియన్ సంస్థ తెలుగులో ‘మహావీరుడు’ పేరుతో విడుదల చేసింది. ఈ శుక్రవారం జూలై 14 ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
సత్య (శివ కార్తికేయన్) కార్టూనిస్ట్. తల్లి (సరిత) తో కలిసి ఓ బస్తీలో ఉంటాడు. అతను మహా భయస్థుడు. ‘మహావీరుడు’ పేరుతో కామిక్స్ రాస్తుంటాడు. ప్రజలను ఓ వీరుడు రక్షించినట్లు కథలు చెప్తుంటాడు. మంత్రి జయసూర్య (మిస్కిన్) బస్తీ వాసులందరికీ ప్రజా భవనం అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్స్ ఇస్తాడు. చాలా నాసిరకంగా కట్టిన ఆ ఫ్లాట్స్ కూలిపోనున్నాయని, ఓ అజ్ఞాత గొంతు (అతనికి మాత్రమే వినిపిస్తుంది) సత్యకు చెప్తుంది. అప్పుడతను ఏం చేశాడు?, ఆ గొంతు అతడికి ఎలా దిశా నిర్దేశం చేసింది?. పిరికివాడైన సత్య ధైర్యవంతుడిగా ఎలా మారాడు?. జర్నలిస్ట్ చంద్రమతితో అతడి రిలేషన్ ఏంటి? అనేది మిగతా కథ.
ఒక పిరికివాడు ప్రజల కోసం ధైర్యవంతుడిగా ఎలా మారాడు అనేదే ‘మహావీరుడు’ కథ. నిలువ నీడ లేకుండా ఉండే పేదవారి సమస్యలు, రాజకీయ పార్టీలు వారి సమస్యలను అడ్డుపెట్టుకుని వారితో ఆడుకునే ఆటల వల్ల జనాల బతుకులు ఎలా నాశనం అవుతున్నాయనేది చెప్పాలనుకున్నాడు దర్శకుడు. ప్రజల కోసం పోరాటం చేయాలనుకుని, తన పరికితనం కారణంగా ఆ పోరాటాన్ని మధ్యలోనే ఆపెయ్యాలనుకున్న హీరోకి, ఓ గొంతు చేసే మాయ ఈ సినిమాకి కొత్తదనాన్ని తీసుకొచ్చింది. తమిళంలో విజయ్ సేతుపతి వాయిస్ చెప్పగా, తెలుగులో రవితేజ గాత్రధానం చేశారు. శివ కార్తికేయన్, రవితేజ వాయిస్ మధ్య వచ్చే సీన్లన్నీ ప్రేక్షకులను నవ్విస్తాయి.
అలాగే శివ కార్తికేయన్ – యోగిబాబుల కామెడీ ఆకట్టుకుంటుంది. దర్శకుడు రాసుకున్న కథ, కథనాలు బాగున్నాయి కానీ కథను వివరించి చెప్పాలని ఉద్దేశంలో కాస్త నిడివి ఎక్కువవుతున్న విషయాన్ని గ్రహించలేదేమో. హీరో పాత్రను పరిచయం చేయడానికి చాలా టైం తీసుకున్నారు. క్లైమాక్స్ సీన్స్ కూడా సాగదీసినట్లు అనిపిస్తుంది. చివరి 15 నిమిషాలు చూస్తే సీక్వెల్ కోసమేననిపిస్తుంది. ప్రభుత్తం కట్టిస్తున్న ఇళ్లల్లో ఎలాంటి మోసాలు జరుగుతున్నాయి?, రాజకీయ నాయకులు ఎలా ఉన్నారు? అనే విషయాలను విపులంగా, అంతర్లీనంగా చెప్పాలనుకున్న దర్శకుడిని అభినందించాలి. కానీ ప్రతీది మరీ డీటేల్డ్‌గా చెప్పాలనుకోవడం వల్ల నిడివి అనేది సినిమాకు మెయిన్ మైనస్‌గా మారింది.
శివ కార్తికేయన్‌కు ఇలాంటి పాత్రలు అలవాటే. తన స్టైల్లో నేచురల్‌గా చేసుకుంటూ వెళ్లిపోయాడు. యాక్షన్ సన్నివేశాల్లో అతని కామెడీ అలరిస్తుంది. రవితేజ వాయిస్ వల్ల ప్రేక్షకులకు కథ కనెక్ట్ అవుతుంది. అదితి తన పాత్రకు న్యాయం చేసింది. దర్శకుడు మిస్కిన్ మంత్రిగా, సునీల్ అతని పీఏగా, సత్య స్నేహితుడిగా యోగిబాబు, తల్లిగా సరిత పాత్రలు ఆకట్టుకుంటాయి.
భరత్ శంకర్ సంగీతం పర్వాలేదు. పాటలు పెద్దగా ఆకట్టుకోకపోయినా.. నేపథ్య సంగీతం బాగుంది. విధు అయ్యన్న తన కెమెరా పనితనంతో సినిమాకి కొత్త అందాన్నిచ్చాడు. ఎడిటర్ ఫిలోమిన్ రాజ్ తన కత్తెరకు ఇంకాస్త పదును పెట్టి ఉండాల్సింది. మిగతా టెక్నీషియన్స్ అందరూ తమ టాలెంట్ చూపించారు.
చివరగా: నవ్విస్తూ.. అక్కడక్కడా మెప్పించే ‘మహావీరుడు’
రేటింగ్: 2/5