దగ్గుబాటి కుటుంబం నుంచి వచ్చిన యువ హీరో దగ్గుబాటి అభిరాం. తేజ దర్శకత్వంలో వచ్చిన అహింస సినిమా విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? దగ్గుబాటి అభిరాం నటన ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.
కొత్త నటులను ఇండస్ట్రీకి పరిచయం చేయడంలో, గుండెకు హత్తుకునే ప్రేమ కథా చిత్రాలను తెరకెక్కించడంలో దర్శకుడు తేజది అందవేసిన చేయి. ఇండస్ట్రీలో ఇప్పటి వరకూ అనేక మంది కొత్త నటులను పరిచయం చేసిన తేజ.. ఈసారి దగ్గుబాటి కుటుంబానికి చెందిన అభిరాంని పరిచయం చేశారు. దగ్గుబాటి అభిరాం హీరోగా, గీతికా తివారీ హీరోయిన్ గా తేజ దర్శకత్వంలో విడుదలైన రొమాంటిక్ యాక్షన్ డ్రామా ఫిల్మ్ ‘అహింస’. మరి ఈ సినిమా ఎలా ఉంది? అభిరాం ఎలా నటించాడు? తన నటనతో ఆకట్టుకున్నాడా? లేదా? అనేది రివ్యూలో చూద్దాం.
రఘు (అభిరాం దగ్గుబాటి), అహల్య (గీతికా తివారీ) ఇద్దరూ బావా మరదళ్ళు. ఇద్దరూ ఒకరినొకరు బాగా ఇష్టపడతారు. ఒకరంటే ఒకరికి ప్రాణం. ఇద్దరికీ పెళ్లి చేయాలని నిశ్చయిస్తారు. నిశ్చితార్థం కూడా చేస్తారు. అయితే అదే రోజున అహల్యపై అత్యాచారం జరుగుతుంది. పలుకుబడి, డబ్బు ఉన్న వ్యక్తి ధనలక్ష్మి దుశ్యంతరావు (రజత్ బేడీ) కొడుకులు అహల్యపై అత్యాచారానికి పాల్పడతారు. సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన రఘు వీరితో అహింసా మార్గంలో చట్టపరంగా పోరాటానికి దిగుతాడు. ఈ క్రమంలో రఘుకి న్యాయవాది లక్ష్మి (సదా) మద్దతు లభిస్తుంది. మరి అహింసకి, అహంకారానికి మధ్య జరిగిన పోరాటంలో అహింస గెలిచిందా? అహంకారం గెలిచిందా? అహింసావాదాన్ని అనుసరించే రఘు తాను నమ్మిన సిద్ధాంతాన్ని పక్కన పెట్టాడా? పాటించాడా? అనేది తెరపై చూడాల్సిందే.
బలవంతుడిపై బలహీనుడు చేసే పోరాటం ఆధారంగా అనేక సినిమాలు వచ్చాయి. జయం సినిమా కూడా ఆల్మోస్ట్ ఇలానే ఉంటుంది. కాకపోతే అక్కడ విలన్ మనసు పడతాడు. ఇక్కడ అత్యాచారం చేస్తాడు. అంతే తేడా. మిగతా ఛేజింగ్ సన్నివేశాలు, యాక్షన్ సీన్లు అన్నీ జయం సినిమా చూసినట్టు ఉంటుంది. హీరో, విలన్ పాత్రల తీరుతెన్నులు చూస్తే జయం సినిమాకి సీక్వెల్ ఏమో అని అనిపిస్తుంది. కానీ సినిమా మాత్రం ఆసక్తికరంగానే ఉంటుంది. అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులను పట్టుకునే సీన్లు, పతాక సన్నివేశాలు, సెకండాఫ్ లో వచ్చే కొన్ని సన్నివేశాలు బాగున్నాయి. హీరో పాత్ర చేసే ప్రయాణం, ఇతర పాత్రలు పలికించిన భావోద్వేగాలు ప్రేక్షకుడికి అంతగా కనెక్ట్ అయ్యేలా ఉండవు. ఫస్ట్ హాఫ్ లో హీరో, హీరోయిన్ మధ్య ఉన్న బాండింగ్ ని చూపించిన విధానం బాగుంటుంది. కథలో మలుపులు, సంఘర్షణలు మెప్పించేలా ఉండవు. న్యాయవాదిగా సదా పాత్ర ఆకట్టుకుంటుంది.
మొదటి సినిమా అయినా కూడా అభిరాం బాగా నటించాడు. ఇక గీతికా తివారీ గ్లామర్, నటన పరంగా ఆకట్టుకుంది. న్యాయవాది పాత్రలో సదా, రజత్ బేడి, కమల్ కామరాజు నటన బాగుంది.
సినిమాటోగ్రఫీ, సంగీతం బాగున్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎడిటింగ్ లో లోపాలు కనిపిస్తాయి. ఇక దర్శకుడు తేజ దర్శకత్వం బాగుంది, అలానే కథ నేపథ్యం కూడా బాగుంది. కానీ సినిమా చూస్తున్నంత సేపూ పాత సినిమాల్లో సన్నివేశాలు గుర్తుకొస్తుంటాయి.
చివరి మాట: అహింస ఒక రొటీన్ లవ్ స్టోరీ
రేటింగ్: 2/5