తమిళ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం

చెన్నై- తమిళ సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ తమిళ నటుడు, డైరెక్టర్ ఆర్‌ఎన్‌ఆర్‌ మనోహర్‌ చనిపోయారు. 61 ఏళ్ల మనోహర్ ఈ మధ్య కరోనా మహమ్మారి బారిన పడటంతో, 20 రోజుల క్రితం ఆయనను చెన్నైలో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. కరోనాతో పోరాడుతూ మనోహర్ బుధవారం తుది శ్వాస విడిచారు.

కరోనా చికిత్స అందిస్తుండగానే గుండెపోటు రావడంతో ఆర్‌ఎన్‌ఆర్‌ మనోహర్ మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు. ఆర్‌ఎన్‌ఆర్‌ మనోహర్‌ కోలీవుడ్‌ లో డైరెక్టర్ గా, నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 1995 లో కోలంగల్‌ సినిమాతో నటుడిగా తెరంగేట్రం చేశారు మనోహర్. దిల్, తెన్నవాన్, వీరమ్, సలీమ్, ఎన్నై అరిందాల్, నానుమ్ రౌడీ దాన్, వేదాలం, విశ్వాసం, కాంచన 3, అయోగ్య లాంటి సినిమాల్లో నటింటిన మనోహర్ మంచి పేరుతెచ్చుకున్నారు.

RNR Manohar 1

2009లో మాసిలమణి సినిమాకు దర్శకత్వం వహించి, తొలి సినిమాతోనే మంచి సక్సెస్ సాధించాడు ఆరఎన్ఆర్ మనోహర్. నంద, పూర్ణ ప్రధాన పాత్రలు పోషించిన యాక్షన్ డ్రామా వెల్లూర్ మావట్టమ్ మూవికి కూడా మనోహర్ దర్శకత్వం వహించారు. ఇటీవల విడుదలైన ఆర్య టెడ్డీ సినిమాలో హీరోయిన్ సాయేషా సైగల్ కు మనోహర్ తండ్రిగా నటించారు.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న హీరో విశాల్ తాజా సినిమా సామాన్యుడులో మనోహర్ కీలక పాత్ర పోషించారు. మనోహర్ మృతికి పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలిపారు. తమిళ చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సినీ ప్రముఖులు ప్రార్ధించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు.