భర్తకి నివాళిగా సైన్యంలో చేరిన భార్య! ఈమెకి సెల్యూట్ చేయకుండా ఉండలేరు!

కొన్ని ఘటనలు రోమాలు నిక్కపొడుచుకునేలా చేస్తాయి. ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఘటన కూడా ఇలాంటిదే. భారతావని సగర్వంగా తల ఎత్తుకుని నిలబడే పని చేసింది ఓ ఇల్లాలు. 130 కోట్ల మంది భారతీయుల చేత శభాష్ అనిపించుకునే పని చేసింది ఆమె. ఇంతకీ ఎవరామె? ఏంటి ఆ కథ అనుకుంటున్నారా? జమ్మూకాశ్మీర్ కు చెందిన 29 ఏళ్ల నితికా కౌల్ కథ ఇది. ఆ వివరావుల్లోకి వెళ్తే.. నిజమైన భారతీయులు ఎవ్వరూ పుల్వామా దాడిని మరచిపోలేరు.ఆ దాడిలో 44 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను ఉగ్రవాదులు బలితీసుకున్నారు. ఆ ఘాతుకానికి పాల్పడిన జైషే మోహ్మద్ ముష్కరుల బృందాన్ని మట్టుపెట్టే క్రమంలో ఆర్మీ మేజర్ విభూతి శంకర్ ధౌండియాల్ అమరులయ్యారు. భర్త అకాల మరణంతో ఆ సమయంలో నితికా కౌల్ తీవ్ర దుఃఖంలోకి వెళ్ళిపోయింది. భర్తతో కలసి ఆమె ఎంతో జీవితాన్ని ఉహించుకుంది. కానీ.., ఆ ఆశలు ఏవి తీరకుండానే భర్త చనిపోవడంతో ఆమె కృంగిపోయింది. మాములుగా అయితే మన దేశంలో ఓ స్త్రీ జీవితం అక్కడితో ఆగిపోయినట్టే. కానీ.., నితికా కౌల్ గుండె ధైర్యంతో జీవితంలో నిలదొక్కుకుంది. ఏ దేశం కోసం అయితే తన భర్త అమరుడయ్యాడో.., అదే దేశం కోసం తన మిగతా జీవితాన్ని దారపోయాలి అప్పుడే నిర్ణయించుకుంది. అలా తాను సైన్యంలో చేరడమే తన భర్తకి నిజమైన నివాళి అందించడం అని నితికా కౌల్ ఓ నిర్ణయానికి వచ్చేసింది.

bharya 2ఇందుకు షార్ట్ సర్వీసు కమిషన్ ద్వారా ఆర్మీకి ఎంపికైంది. ఆ తరువాత చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు నితికా కౌల్. ఇక ఈ శనివారం జరిగిన పాసింగ్ ఔట్ పరేడ్ లో లెఫ్టినెంట్ హోదాతో నితికా భారత సైన్యంలోకి ప్రవేశించారు. నార్తరన్ కమాండ్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ వైకే జోషి.. నితికాకు మెడల్ ధారణ చేశారు. ఆర్మీలో చేరడం ద్వారానే తన భర్తకు నిజమైన నివాళి అర్పిస్తానని ఆనాడే ప్రకటించిన నితికా.. ఇలా తన మాటని నిలబెట్టుకోవడంతో ఆమెకి దేశ వ్యాప్తంగా ప్రసంశలు లభిస్తున్నాయి. అమ్మా.., నువ్వు ఈ దేశానికి ఆదర్శంగా నిలిచావు అంటూ నెటిజన్స్ నితికాను కీర్తిస్తున్నారు. కాగా.., దీనిపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ట్విట్టర్లో స్పందిస్తూ…నితికా కౌల్కు అభినందనలు తెలిపారు. “లెఫ్టినెంట్-నితికా కౌల్, మీరు భారతదేశ నారీ శక్తి స్వరూపం. మీ అంకితభావం, సంకల్పం, భక్తి గొప్పది. నీ భర్త మేజర్ విభూతి ధౌండియాల్ ఈ రోజు మీ భుజంపై ఉన్న నక్షత్రాలను చూసి ఆనందం, గర్వంతో నవ్వుతారు.’’ అంటూ ట్వీట్ చేశారు. మరి చూశారు కదా.. చనిపోయిన భర్తకి సరైన నివాళి అర్పించడానికి నితికా కౌల్ చేసిన పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.