ఇంకో వారం రోజుల్లో రాఖీ పండుగ వేడుకలు జరుగనున్నాయి. దీనికోసం మార్కెట్ లో వివిధ రకాల రాఖీలు సందడి చేస్తున్నాయి. అక్కాతమ్ముళ్లు, అన్నా చెల్లెళ్లు ప్రేమానురాగాలతో జరుపుకునే పండగ రక్షాబంధన్.
ఇంకో వారం రోజుల్లో రాఖీ పండుగ వేడుకలు జరుగనున్నాయి. దీనికోసం మార్కెట్ లో వివిధ రకాల రాఖీలు సందడి చేస్తున్నాయి. అక్కాతమ్ముళ్లు, అన్నా చెల్లెళ్లు ప్రేమానురాగాలతో జరుపుకునే పండగ రక్షాబంధన్. సోదరుల విజయాలను కాంక్షిస్తూ సోదరీమణులు రాఖీలు కడతారు. కాగా దేశ రక్షణలో భాగంగా విధులు నిర్వహిస్తున్న సైనికులకు రాఖీలు కట్టేందుకు వినూత్నంగా ఆలోచించారు ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పుర్ జిల్లా సాయిమౌళి ఆలయ కమిటీ. రాఖీ పండుగ రోజున తమ తోబుట్టువులను మిస్ అవుతున్నామనే భావన కలగకుండా ఉండేందుకు ఆ ప్రయత్నం చేస్తున్నట్లు వారు తెలిపారు.
రాఖీ పండుగను ప్రత్యేకంగా జరుపుకోవడానికి దేశ సైనికుల కోసం 27 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పుతో రాఖీని తయారు చేశారు సాయిమౌళి ఆలయ కమిటీ. ఈ ప్రత్యేకమైన రాఖీలో 21 మంది వీరజవాన్ల ఫొటోలను అమర్చారు. వీరితో పాటు రాష్ట్రపతి, ప్రధాని, రక్షణమంత్రి చిత్రాలను కూడా ఇందులో పొందుపర్చారు. ఈ రాఖీని బిలాస్‌పుర్ జిల్లా సైనిక్ సంక్షేమ బోర్డు అధికారుల ద్వారా రోడ్డు మార్గంలో ఉధంపుర్‌కు తరలించారు. ఉధంపూర్ సైనికులకు అందించనున్నారు. ఇక ఈ విషయంపై ఆలయ కమిటీ సమన్వయకర్త దిలీప్ దేవర్కర్ పాత్రేకర్ మాట్లాడుతూ.. దేశ సైనికులు తమ ఇళ్ల నుంచి తమ అక్కాచెళ్లేల్లు రాఖీ పంపించినట్లుగా అనుభూతి పొందాలని ఇలా ప్రత్యేక రాఖీలు తాము పంపుతున్నట్లు వెల్లడించారు.