భూమి మీద నూకలు మిగిలుంటే కరోనా కాదు కదా.., ఆ యుముడైనా ప్రాణాలని తీసుకోపోలేదు. ఈ విషయాన్ని రుజువు చేసింది మహారాష్ట్రకి చెందిన ఓ బామ్మ. కరోనా కారణంగా కన్ను మూసిన ఆ పెద్దావిడ.. స్మశానంకి తీసుకుని వెళ్తుండగా మార్గ మధ్యలో లేచి కూర్చొని అందరికీ షాక్ ఇచ్చింది. దీనితో ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ అసలు ఏమి జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.
దేశంలోని మిగతా రాష్ట్రాలలో లానే మహారాష్ట్రలో కూడా కరోనా బీభత్సం కొనసాగుతోంది. ఇక ఈ రాష్ట్రంలో ముధాలే జిల్లాలో బారామతి అనే గ్రామం ఉంది. ఇక్కడే దశాబ్దాలుగా నివాసం ఉంటోంది శకుంతల గైక్వాడ్ అనే బామ్మ. ఆమె వయసు 76 సంవత్సరాలు. అయితే.., అప్పటి వరకు ఆరోగ్యంగానే ఉన్న బామ్మ ఒక్కసారిగా మెత్తబడిపోయింది. పైగా తీవ్ర జ్వరం. ఆహరం కూడా తీసుకోలేని పరిస్థితి. దీనితో ఆమెకి కోవిడ్ టెస్ట్ చేయించారు కుటుంబ సభ్యులు. టెస్ట్ రిజల్ట్ పాజిటివ్ వచ్చింది. దీంతో బామ్మని హాస్పిటల్ లో చేర్చడానికి కుటుంబ సభ్యులు శాయి శక్తులా కృషి చేశారు. కానీ.., ఏ హాస్పిటల్ కి వెళ్లినా బామ్మకి బెడ్స్ దొరకలేదు. దీనితో ఇక చేసేది లేక శకుంతల గైక్వాడ్ ని అలాగే కార్ లో ఉంచేశారు. సమయానికి వైద్యం అందకపోవడంతో బామ్మ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు ఎన్ని విధాలుగా లేపి చూసినా ఆమెలో చలనం లేదు. శ్వాస కూడా తీసుకోవడం ఆగిపోయింది. మనిషిలో అస్సలు కదలిక లేకపోవడంతో బామ్మ చనిపోయినట్టు నిర్ధారించుకున్నారు.
కరోనా నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ .., కేవలం కుటుంబ సభ్యులు, దగ్గర బంధువుల సహకారంతో బామ్మ అంతిమ యాత్ర మొదలైంది. ఇక కాసేపటిలో స్మశానం రాబోతుంది అనగా బామ్మలో కదలికలు మొదలయ్యాయి. అందరూ అలా చూస్తుండగానే బామ్మ ఒక్కసారిగా కళ్ళు తెరిచింది. అంతే అక్కడ ఉన్న వారిలో కొంత మంది భయంతో పరుగులు తీశారు. కానీ.., చివరికి బామ్మ బతికే ఉందని తెలుసుకుని ఆమెని దగ్గరలోని ఓ చిన్న ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు. ప్రస్తుతం 76 ఏళ్ళ ఈ బామ్మ చికిత్య అందుకుంటూ.., కోలుకుంటోంది. కరోనా కల్లోలంలో ఇలాంటి ఆశ్చర్యకర ఘటనలు కూడా చోటు చేసుకుంటుండటం విశేషం.