తుపాకీ ఎక్కుపెట్టినా.. ఎదురు నిలిచిన మహిళ!

ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్‌ కరడు కట్టిన తాలిబన్ల వశమైన విషయం తెలిసిందే. ముందు నుంచి తాలిబన్లు అంటే మత ఛాందసవాదులని.. ఆడవారిపై వివక్షత చూపిస్తారన్న విషయం తెలిసిందే. ఇప్పటికే అక్కడ ఆడవారిపై రక రకాల ఆంక్షలు పెడుతున్న నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్‎‎లో మహిళలు తమ హక్కుల కోసం రోడ్లేక్కుతున్నారు.

taliban minతమ వ్యక్తిగత హక్కులు మరియు స్వేచ్ఛను కాపాడుకోవడానికి తాలిబన్లకు వ్యతిరేకంగా నిలబడుతున్నారు. అందులో భాగంగా తాలిబాన్లకు వ్యతిరేకంగా ప్లకార్డులు, బ్యానర్లు పట్టుకుని నినాదాలు చేస్తున్నారు. పంజ్‌షీర్‌లో పాక్‌ యుద్ధ విమానాల దాడులపై కాబూల్‌లో పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. కాబూల్‌లోని పాక్‌ రాయబార కార్యాలయం ఎదుట ఆ దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో తాలిబన్లు గాల్లోకి కాల్పులు జరిపారు.. కానీ జనం బెదరకుండా నినాదాలు కొనసాగించారు.

ఒక తాలిబన్ ముందుకొస్తున్న మహిళకు తుపాకీ ఎక్కుపెట్టగా.. ఏ మాత్రం బెదరకుండా ముందుకు రావడం అంతర్జాతీయంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రాయిటర్స్‌ జర్నలిస్ట్‌ తీసిన ఈ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఆఫ్ఘనిస్థాన్‌ మహిళల దృఢ నిశ్చయానికి ఇది నిదర్శమని కొందరు నెటిజన్లు ప్రశంసించారు. కాబూల్ నగరానికి పశ్చిమాన ఉన్న దష్త్-ఇ-బార్చి నుంచి వారి నిరసన ప్రారంభమైంది. ‘మహిళలు లేని మంత్రివర్గం విజయవంతం కాదు’ అని మహిళలు నినాదించారు. ఏది ఏమైనా ఇప్పుడు ఆఫ్ఘన్ మహిళలు ఎంతగా ఆవేదన చెందుతున్నారో.. ఎంత ఆవేశంలో ఉన్నారో అన్న విషయం ఈ ఒక్క ఘటన తెలియజేస్తుంది.