కరోనా కాలంలో మానవాళి ఇది వరకు ఎరుగని దారుణాలను చవి చూస్తోంది. అన్నీ వర్గాల ప్రజలు ఈ మహమ్మారి దెబ్బకి అల్లాడుతున్నారు. ఇక మన దేశంలో కొంతమంది దిగ్గజాలు ఈ చైనా వైరస్ దాటికి కుప్ప కూలుతుండటం అందరిని తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేస్తోంది. తాజాగా ఇలాంటి విషాదకర ఘటన మరొకటి చోటు చేసుకుంది. కరోనా వైరస్ భారత దిగ్గజ అథ్లెట్ మిల్కా సింగ్‌ను బలి తీసుకుంది. ఇంకా బాధాకరమైన విషయం ఏమిటంటే ఐదు రోజుల క్రితమే ఆయన భార్య నిర్మల్ కౌర్ కూడా కరోనాతో పోరాడుతూ కన్ను మూసింది. భార్య చనిపోయిన 5 రోజులకే మిల్కా సింగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిజానికి మిల్కాసింగ్‌కు మే 20వ తేదీన కరోనా సోకింది. అక్కడ నుండి సరిగ్గా నెలరోజుల పాటు కరోనాతో పోరాడి దిగ్గజ అథ్లెట్ తుదిశ్వాస విడిచారు. ఇక మిల్కా సింగ్ మృతిపై ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు.
దేశ విభజన సమయంలో పాకిస్థాన్ లో సిక్కులు, హిందువుల మీద జరిగిన ఊచకోతలో కుటుంబ సభ్యులను కోల్పోయి, కట్టు బట్టలతో భారత దేశానికి వచ్చారు మిల్కా. అత్యంత దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కుని కూడా జీవితంలో విజేతగా నిలిచిన వ్యక్తి మిల్కా సింగ్ ఆర్మీలో ఉద్యోగంలో జాయిన్ అయిన అనంతరం సికింద్రాబాద్ కంటోన్మెంట్ లోనే అయన చాలాకాలం పని చేశారు. ఆర్మీలో ఉన్నప్పుడు మిల్కా సింగ్ పరుగు పందెంలో చూపిన ప్రతిభను గుర్తించిన అధికారి మిల్కా సింగ్ ను సానాబట్టి మెరుగైన అథ్లెట్ గా తీర్చి దిద్దారు.
పాకిస్థాన్ లో జరిగిన ఒక పరుగు పందెంలో మెరుపు వేగంతో పరుగెత్తి విజేతగా నిలిచారు.. ఆ పోటీకి ముఖ్య అతిథిగా వచ్చిన అప్పటి పాకిస్థాన్ జనరల్ నువ్వు పరుగెత్తలేదు, గాల్లో ఎగిరావని ఫ్లయింగ్ సిఖ్ గా మిల్కా సింగ్ ను అభినందించారు. అప్పటి నుండి మిల్కా సింగ్ కి ఆ పేరు పడిపోయింది. ఇక అథ్లెటిక్స్ లో మిల్కా సింగ్ భారతదేశానికి అనేక పథకాలు సాధించి దేశ భ్యాతిని ఇనుమడింపజేశారు. దేశానికి మెడల్స్ సాధించి పెట్టాలనే ఎంతో మంది యువతకి స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు. స్ప్రింట్ ఐకాన్ గా పేరు దక్కించుకున్న ఇలాంటి దిగ్గజ అథ్లెట్ మరణంతో దేశంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.