సుశీల్ కుమార్. వరల్డ్ రెజ్లింగ్‌లో అతనో ఐకాన్. ఇండియా స్పోర్ట్స్ హిస్టరీలోని గొప్ప అథ్లెట్లలో ఒకడు. అయినా సాగర్ రాణా హత్య కేసులో సుశీల్ పీకల్లోతు ఇరుక్కుపోవడానికి కారణం, సాగర్, అతడి ఇద్దరు మిత్రులపై సుశీల్ బృందం హాకీ, బేస్‌బాల్ బ్యాట్లతో దాడి చేసినట్లుగా వెల్లడైన సంగతి తెలిసిందే. నిందితుల్లో ఒకడైన ప్రిన్స్ దాడి ఘటనను వీడియో తీయగా సాగర్ చనిపోయిన రెండు రోజుల తర్వాత అతణ్ని అదుపులోకి తీసుకున్నపుడు తన మొబైల్ పరిశీలించగా అది బయటపడింది. అతడిపై జరిగిన దాడిలో సుశీల్ స్వయంగా పాల్గొన్నట్లుగా పోలీసుల దగ్గర వీడియో ఆధారాలు ఉండటమే. అందులో సుశీల్ సైతం సాగర్‌పై దాడి చేస్తున్నట్లు కనిపించడంతో ఈ కేసులో అతడికి వ్యతిరేకంగా పోలీసులకు బలమైన సాక్ష్యం దొరికినట్లయింది. అయితే రెజ్లర్‌గా ఎంతో గొప్ప పేరున్న సుశీల్ ఇలా దాడి చేయడమే కాక దాన్ని వీడియో తీయించుకోవడమేంటి అనే ప్రశ్న తలెత్తుతోంది. సాగర్ తనను బహిరంగంగా దూషించిన నేపథ్యంలో ఇంకెవరూ ఇలా చేయకుండా, రెజ్లింగ్ వర్గాల్లో భయం పుట్టించడానికే సుశీల్ చెప్పి మరీ దాడి ఘటనను వీడియో తీయించాడని పోలీసులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా సాగర్ మృతి అనంతరం సుశీల్ అజ్ఞాతంలోకి వెళ్లిపోవడానికి కాలా జతేది అనే గూండా కూడా కారణమని అంటున్నారు.
సుశీల్ బృందం దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఇద్దరిలో ఒకడైన సోను జతేదికి మేనల్లుడట. ఓవైపు హత్య కేసులో చిక్కుకోవడానికి తోడు జతేది తననేమైనా చేస్తాడన్న భయం కూడా సుశీల్ అజ్ఞాతంలోకి వెళ్లిపోవడానికి కారణమని పోలీసు వర్గాలంటున్నాయి. మరోవైపు హత్య కేసు విచారణ జరుగుతున్నందున సుశీల్ విషయంలో తాము చేసేదేమీ లేదని భారత రెజ్లింగ్ సమాఖ్య సహాయ కార్యదర్శి వినోద్ తోమర్ అన్నాడు. సుశీల్ పట్ల తమకు సానుభూతి ఉందని, కానీ అతడి లాంటి దిగ్గజ రెజ్లర్ మీద ఇలాంటి అభియోగాలు రావడం వల్ల దేశంలో రెజ్లింగ్ ప్రతిష్ఠ దెబ్బ తింటుందన్నది మాత్రం వాస్తవమని అతను చెప్పాడు. హత్య కేసులో అరెస్టయి పోలీసుల రిమాండులో ఉన్న దిగ్గజ రెజ్లర్ సుశీల్ కుమార్‌పై ఉత్తర రైల్వే వేటు వేయబోతోందిట.