ఈ మద్య కాలంలో సమాజంలో జరుగుతోన్న కొన్ని సంఘటనలు చూస్తుంటే అసలు మానవత్వం పూర్తిగా నశించిపోయిందన్న అనుమానాలు కలుగుతున్నాయి. గత కొంత కాలంగా ఆడవారిపై జరుగుతున్న అఘాయిత్యాలు అన్నీ ఇన్నీ కావు. కనీస మానవత్వాన్ని మరిచి చేస్తున్న పనులు అసలు వీరు మనుషులేనా అనే సందేహాన్ని కలిగిస్తున్నాయి.
ప్రతిరోజూ ఎక్కడో అక్కడ కామాంధులు కృర మృగాళ్లా రెచ్చిపోతున్నారు.. చిన్న పిల్లలు అని కూడా చూడకుండా దారుణాలకు పాల్పపడుతున్నారు. మరికొంత మంది వివాహేతర సంబంధాలు పెట్టుకొని అడ్డు వచ్చిన చిన్న పిల్లలను దారుణంగా హింసించడం.. చంపేయడం లాంటివి చేస్తున్నారు. తాజాగా ఓ తండ్రి ముక్కు పచ్చలారని ఓ చిన్నారిని అత్యంత దారుణంగా హింసించిన ఘటన మెదక్ జిల్లాలో జరిగింది. ఈ వార్త తెలిసిన వారంతా వీడు అసలు మనిషేనా అని చీదరించుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే.. మెదక్ మున్సిపల్‌లో నాగరాజు అనే వ్యక్తి ట్రాక్టర్ డ్రైవర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇతనికి ఓ మూడేళ్ల చిన్నారి ఉంది. నాగరాజు గత కొన్ని రోజుల క్రితం మొదటి భార్యను వదిలేసి రెండో వివాహం చేసుకున్నాడు. కాకపోతే తన కూతురుని మాత్రం తన వద్దనే ఉంచుకున్నాడు.
భార్యను కాదన్నా కూతురు పై ప్రేమతో తన వద్దనే ఉంచుకున్నాడనుకుంటే పొరపాటే.. ఆ పాపపై తన కృరత్వాన్ని చూపిస్తూ.. భార్యపై ఉన్న కక్ష్య మొత్తం తీర్చుకుంటున్నాడు. తాజాగా ఆ చిన్నారిపై పాశవికంగా దాడి చేసి.. ఒక చేత్తో గాల్లోకి లేపుతూ నేలపై కొట్టాడు. ఈ సమయంలో అక్కడే ఉన్న ఆ రెండో భార్య చిరు నవ్వులు చిందుస్తుండడం గమనార్హం. దీనంతటిని అక్కడే ఉన్న కొందరు సీక్రెట్‌గా ఫోన్‌లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో నెటిజన్లు ఛీ.. వీడు అసలు తండ్రేనా అంటూ తిట్టడం మొదలు పెట్టారు. అంతే కాదు కన్న కూతురుని పాశవికంగా కోడుతున్న రాజుపై కఠినమైన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు. ఇక ఈ విషయం పోలీసులకు వరకు వెళ్లడంతో తల్లిదండ్రులకు పోలీసులు గట్టిగా కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇలాంటిది మళ్లీ పునరావృతం అయితే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.