తెలుగు, తమిళ ఇండస్ట్రీలో హీరో సిద్దార్థ్ కి మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. శంకర్ దర్శకత్వంలో ‘బాయ్స్’చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సిద్దార్థ్ తర్వాత తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించారు. తెలుగులో ఆయన చేసిన సినిమాల్లో ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా?’, ‘బొమ్మరిల్లు’ సినిమాలు ముందువరుసలో కనిపిస్తాయి. అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ’మహాసముద్రం‘ లో శర్వానంద్ తో కలిసి సిద్ధార్థ్ నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ ఎంతగానో ఆకట్టుకుంది. అనిల్ సుంకర నిర్మించిన ఈ సినిమాలో చైతన్ భరద్వాజ్ సంగీతాన్ని అందించాడు. దసరా పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని అక్టోబర్ 14వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు.
ఈ నేపథ్యంలో నిన్న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. ఈ వేదికపై నుంచే ట్రైలర్ ను రిలీజ్ చేశారు. అయితే ఈ కార్యక్రమానికి సిద్ధార్థ్ మాత్రం హాజరుకాలేదు. అక్కడ ఉన్నవారు ఈవెంట్ కి సిద్ధార్థ్ ఎందుకు రాలేదనే అనుమానాలను అభిమానులు వ్యక్తం చేశారు. సిద్ధార్థ్ రాకపోవడానికి కారణమేంటో ఇప్పుడు వెల్లడైంది. ఈ సందర్భంగా అజయ్ భూపతి మాట్లాడుతూ.. సిద్ధార్థ్ లండన్ లో ఉన్నాడు. అక్కడి ఓ హాస్పిటల్ లో చిన్న సర్జరీ చేయించుకున్నాడని వెల్లడించారు.
అయితే, సిద్ధూకు వచ్చిన సమస్య ఏమిటి? ఏ సర్జరీ చేయించుకున్నాడనే విషయంలో మాత్రం క్లారిటీ రాలేదు. ఎప్పుడూ సోషల్ మీడియలో ఎంతో యాక్టివ్ గా ఉండే సిద్ధార్థ్ కరెంట్ ఎఫైర్స్ కి సంబంధించిన విషయాలను గురించి ఆయన తన స్పందనను తెలియజేస్తూ ఉంటాడు. అలాగే రాజకీయాలకి సంబంధించిన అవినీతిని ప్రశ్నిస్తూ ఉంటాడు. అలాంటిది సిద్ధార్థ్ తన సర్జరీకి సంబంధించిన విషయాన్ని సోషల్ మీడియాలో ప్రస్తావించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఏది ఏమైనా.. అభిమానులు మాత్రం ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.