నటుడితో పాటు, రచయిత, గాయకుడు, తాత్వికుడు ఇలా అనేక కోణాలు కలిగిన వ్యక్తి తనికెళ్ల భరణి. పాత్ర ఏదైనా నూటికి నూరు శాతం పరిపూర్ణ న్యాయం చేయగల గొప్ప నటుడు. ఆ పాత్రలో కనిపించేది భరణి కాదు.. ఆ పాత్ర ప్రతిరూపమే. అంతలా మనల్ని ఆయన నటనతో మాయచేస్తారు. శివ చిత్రం తర్వాత తనికెళ్ల భరణికి చాలా వరకు నెగిటీవ్ పాత్రలు వచ్చినా.. మణి చిత్రం తర్వాత తనదైన కామెడీ పండించడంలో కొత్త స్టైల్ చూపించారు తనికెళ్ల భరణి. వంశీ దర్శకత్వంలో వచ్చిన శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ సినిమాకు మంచి సంభాషణలు అందివ్వడమే కాక ఒక మంచి పాత్రను కూడా పోషించాడు.
కామెడీ, విలన్, ఉదాత్తమైన వైవిధ్యమైన పాత్రధారణతో భరణి ప్రజాదరణ పొందిన నటులలో ఒకడయ్యాడు. తాజాగా తనికెళ్ళ భరణికి లోక్ నాయక్ ఫౌండేషన్ సాహిత్య పురస్కారం ప్రకటించింది. జనవరి 18న ఎన్టీఆర్, హరివంశరాయ్ బచ్చన్ వర్థంతి సందర్భంగా ఈ పురస్కారాన్ని అయనకు అందచేయనున్నారు. ఈ మేరకు లోక్ నాయక్ ఫౌండేషన్ ఛైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ప్రకటించారు.
ఈ పురస్కారం కింద లక్షరూపాయల నగదుని బహుమతిగా అందచేసి సత్కరిస్తూ వచ్చారు. అయితే ఈ ఏడాది రెండు లక్షల నగదును బహుమతిగా అందచేసి సత్కరించనున్నట్లు తెలిపారు లక్ష్మీప్రసాద్. గతంలో భరణికి పలు సాంస్కృతిక అవార్డులతో పాటు ప్రభుత్వ నంది అవార్దులు కూడా లభించాయి. తాజాగా మరో అరుదైన గౌరవ పురస్కారాన్ని తనికెళ్ల భరణికి రావడం ఫ్యాన్స్, సహ కళాకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.