నటీనటులు: కంగన రనౌత్, అరవింద్ స్వామి, సముద్ర ఖని, రాధా రవి, భాగ్య శ్రీ, మధుబాల తదితరులు
కథ: విజయేంద్ర ప్రసాద్
సినిమాటోగ్రఫర్: విశాల్ విట్టల్
ఎడిటర్: ఆంటోనీ, భల్లు సలూజ
సంగీతం: జీవి ప్రకాశ్ కుమార్
నిర్మాతలు: విష్ణు ఇందూరి, శైలేష్ ఆర్ సింగ్, బృందా ప్రసాద్
దర్శకుడు: ఏఎల్ విజయ్
విడుదల తేదీ: 10-09-2021
భారతీయ చలన చిత్ర రంగంలో ఇప్పటి వరకు ఎన్నో బయోపిక్ చిత్రాలు వచ్చాయి. పలు రంగాల్లో విశేష కృషి, గుర్తింపు సంపాదించి ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తులు, దేశానికి వన్నె తెచ్చినవారి జీవితాలను వెండితెరపై ఆవిష్కరించి మంచి సక్సెస్ సాధించారు ఫిలిమ్ మేకర్స్. ఈ క్రమంలో రూపొందిన మరో బయోపిక్ ‘తలైవి’. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితంలో జరిగిన కీలక ఘట్టాలను ఆధారంగా చేసుకొని తెరకెక్కించిన చిత్రం తలైవి. ఎ.ఎల్. విజయ్ దర్శకత్వంలో బాలీవుడ్ సంచలన తార కంగనా రౌనత్.. అలనాటి అందాల నటుడు అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో నటించారు. విబ్రి మోషన్ పిక్చర్స్, కర్మ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై విష్ణువర్దన్ ఇందూరి, శైలేష్ ఆర్ సింగ్ ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులకు అందించారు.
కథ :
తమిళనాడు అసెంబ్లీలో జయలలితకు జరిగిన పరాభవంతో సినిమా ప్రారంభమవుతుంది. 1989 తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకురాలైన జయలలిత(కంగనా రనౌత్).. అధికార పక్షంలోని ముఖ్యమంత్రి కరుణ(నాజర్)ను నిలదీస్తుంది. తన పార్టీ ఎమ్మెల్యేలను పోలీసులు దౌర్జన్యంగా, అకారణంగా అరెస్టులు చేస్తున్నారంటూ ప్రశ్నించడంతో అధికార పక్ష నేతలు అసెంబ్లీ హాలులోనే కొట్టి, చీరె లాగి అవమానించిన సంఘటనతో జయలలిత ఎంతగా రగిలిపోయింది? దీనికి ప్రతీకారాన్ని ఎలా తీర్చుకుంది? తాను కూడా ముఖ్యమంత్రి అయ్యే వరకు అసెంబ్లీలో అడుగు పెట్టనని శపథం చేస్తుంది. ఇక్కడ సీన్ కట్ చేస్తే.. సినిమా ఫాష్ బ్యాక్ లోకి వెళ్లిపోతుంది.
సినిమా 1965లో పదహారేళ్ల వయసులోనే హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది.. ఈ క్రమంలోనే తమిళనాట టాప్ హిరోగా వెలిగిపోతున్న ఎం.జి.రామచంద్రన్(అరవింద్ స్వామి) తో పరిచయం ఏర్పడటం.. తర్వాత రాజకీయాల్లోకి రావడం.. ఆ సమయంలో జయలలిత ఎలాంటి క్లిష్ఠ పరిస్థితులు ఎదుర్కొందని అన్న విషయాన్ని రాజకీయాలపై చూపిస్తున్న ప్రభావాన్ని హైలైట్ చేస్తూనే జయ జీవితాన్ని తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. జయ – ఎంజీఆర్ మధ్య బంధాన్ని తెరపై ఆవిష్కరించిన తీరు కూడా మెప్పిస్తుంది. వాళ్లిద్దరి మధ్య బంధం ఏమిటనే విషయంలో ఎక్కడా తూకం చెడకుండా సున్నితంగా ఆవిష్కరించారు.
ఫస్టాఫ్ లో జయ సినీ కెరీర్ గురించి చూపించి.. సెకండ్ ఆఫ్ మొత్తం రాజకీయం కోణం చూపించారు. జయ రాజ్యసభకి వెళ్లడం, ఇందిరాగాంధీని కలవడం, ఎంజీఆర్‌కి అనారోగ్యం, ఆ తర్వాత చోటు చేసుకునే పరిణామాలు ఉత్కంఠని రేకెత్తిస్తాయి. ఎంజీఆర్ అనారోగ్యంతో మరణించడంతో పార్టీ పగ్గాలు జయ చేతికి వెళతాయి. కరుణకు గుణపాఠం చెప్పడం, పార్టీ అంతర్గత శక్తులను ధీటుగా ఎదుర్కోవడం లాంటి అంశాలతో సినిమా సాగుతుంది.
విశ్లేషణ:
సాధారణంగా బయోపిక్స్ తీయడంలో మేకర్స్ ప్రతి చిన్న విషయాన్ని ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. నిజ జీవితాన్ని తెరపై కమర్షియల్ గా చూపించడం చాలా కష్టమైన పని అన్న విషయం తెలిసిందే. అయితే రాజకీయ నాయకులు జీవిత చరిత్రలను సినిమాలుగా మలిచేటప్పుడు మరి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరి మనోభావాలు దెబ్బ తినకుండా చూసుకోవాలి. వివాదాస్పద అంశాలు లేకుండా ఏ బయోపిక్ తీసినా ప్రయోజనం ఉండదు. జయ జీవితం అంటేనే వివాదాల మయం. కానీ ఇందులో ఎలాంటి వివాదాల జోలికి పోకుండా సినిమాని ముగించడమే పెద్ద మైనస్ పాయింట్. ‘తలైవి’ విషయంలో దర్శకుడు ఎ.ఎల్.విజయ్ సినిమాను తెరకెక్కించిన తీరు చూస్తే.. సినిమా ప్రారంభం అద్భుతంగా ఉంది. జయలలిత అసెంబ్లీలో అవమానపడే సన్నివేశం నేటితరంలో చాలా మందికి కనెక్ట్ అవుతుంది. కథనంలో దర్శకుడు ఎ.ఎల్. విజయ్ అక్కడక్కడా మెరుపులు మెరిపించాడు.
ఎవ్వరినీ నొప్పించకుండా సినిమా తీయాలని ముందే నిర్ణయించుకున్నట్టు అనిపించింది. తన శత్రువులను జయ ఎలా ఎదుర్కొంది అని మాత్రమే సినిమాలో చూపారు. సినిమా వెళ్లే కమ్రంలో జయలలిత హీరోయిన్గా మారే క్రమంలో ఎం.జి.రామచంద్రన్‌తో పరిచయం.. గ్లామర్ హీరోయిన్ గా ఉన్న ఆమె తర్వాత ఐరన్ లేడీగా ఎలా మారారు అన్న కోణం అద్భుతంగా ఆవిష్కరించారు. సెకండాఫ్‌లో జయలలితను రాజకీయాల్లోకి రావాలంటూ రామచంద్రన్ ఆహ్వానించటం.. ఆమె, పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇవ్వడానికి ఎదురైన ఎమోషనల్ సీన్స్.. జయ.. అమ్మగా ఎలా మారింది అనే విషయాన్ని చక్కగా తెరపై చూపించారు దర్శకుడు ఎ.ఎల్. విజయ్.
నటీనటులు :
ఎలాంటి పాత్రలకైనా తన నటనతో న్యాయం చేసి మెప్పించగల కంగనా రౌనత్.. జయలలిత పాత్రకు ప్రాణం పోసిందనే చెప్పాలి. అందాల నటిగా ఉన్న ఆమె తర్వాత పురుచ్చి తలైవిగా ఎలా మారింది అన్న తీరు తన నటనలో చాలా అద్భుతంగా చూపించింది. ఇక ఎంజీఆర్ పాత్రలో అరవింద్ స్వామి నటించారు అనడం కన్నా జీవించారు అనే చెప్పాలి. ఎంజీఆర్ కుడిభుజం వీరప్పన్ గా సముద్ర ఖని మెప్పించారు. కరుణ పాత్రలో నాజర్, జయ తల్లి సంధ్యగా బాలీవుడ్ నటి భాగ్యశ్రీ తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతిక వర్గం :
తలైవి సినిమాకు ప్రధాన ప్లస్ పాయింట్ మ్యూజిక్. జీవి ప్రకాశ్ కుమార్ సంగీతం చాలా బాగుంది. పాటలు అంతగా కనెక్ట్ కాలేదు కానీ బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం బాగుంది. విజయేంద్ర ప్రసాద్ కథ బాగుంది. జయలలిత జీవితం మొత్తం కాకుండా ఆమె లైఫ్‌లోని ప్రధాన ఘట్టాలను బాగా రాసుకున్నాడు. దాన్ని తెరపై చూపించడంలో విజయ్ కూడా సక్సెస్ అయ్యాడు. విశాల్ విట్టల్ సినిమాటోగ్రఫీ చాలా అద్భుతంగా చూపించారు. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. మొత్తానికి ఎమోషనల్ సీన్స్ డైరెక్టర్ బాగానే డిజైన్ చేయడంలో సక్సెస్ సాధించాడు.
ప్లస్ పాయింట్స్ : కంగన,అరవింద్ స్వామి
మైనస్ పాయింట్స్ : సెకండ్ ఆఫ్ కొన్ని బర్ సీన్లు, జయలలిత జీవితం కొంతవరకే చూపించడం
రేటింగ్ : 3.0/5
బాటమ్ లైన్ : ‘తలైవి’ఓ అద్భుత ఆవిష్కరణ