గుండమ్మ కథకి 60 వసంతాలు! ఈ క్లాసిక్ గురించి మీకు తెలియని 10 నిజాలు!

విజయ పిక్చర్స్.. సూపర్ హిట్ సినిమాలని అందించిన బ్యానర్. షావుకారు, మిస్సమ్మ, పాతాళా బైరవి, మాయాబజార్ లాంటి అజరామరాలు అన్నిటికీ కారణం నాగిరెడ్డి చక్రపాణి ద్వయం. అలా వీరి కృషితో విజయ బ్యానర్ లో 1962వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకి వచ్చిన దృశ్య కావ్యం గుండమ్మకధ. కమలాకర కామేశ్వర్ రావు ఈ క్లాసిక్ ని తెరకెక్కించిన దర్శకుడు. మరి.. 60 వసంతాలను పూర్తి చేసుకున్న ఈ అజరామర చిత్రం గురించి ఎవ్వరికీ తెలియని 10 విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

1) తెలుగు సినిమా ఖ్యాతిని ఆ రోజుల్లోనే చాటి చెప్పిన గుండమ్మ కథ ఓ కన్నడ రీమేక్ మూవీ అని ఈ నాటికీ చాలా మందికి తెలియదు. జానపద బ్రహ్మ విఠలాచార్య 1958లోనే కన్నడలో మనె తుంబిద హెణ్ణు అనే పేరుతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తరువాత నరసరాజు గారి సహకారంతో మన తెలుగు నేటివిటి తగ్గట్టు గుండమ్మ కథ స్క్రిప్ట్ లో మార్పులు చేపించారు.

2) యన్టీఆర్, ఏయన్నార్, సావిత్రి, జమున, యస్వీఆర్, రమణారెడ్డి వంటి స్టార్స్ డేట్స్ దొరికినా.., చక్రపాణి, నాగిరెడ్డి మాత్రం సినిమాని సెట్స్ పై కి తెసుకెళ్ళే దైర్యం చేయలేకపోయారు. కారణం గుండమ్మకధకి గుండమ్మ లేకపోవడం. అప్పటికే ఎంతో మందిని ప్రయత్నించి చూశారు. అయినా లాభం లేక పోయింది. మరో వైపు యన్టీఆర్, ఏయన్నార్ ఇచ్చిన డేట్స్ చేజారిపోతే ఎలా అన్న భయం పట్టుకుంది. ఇంత టెన్షన్ లొనూ చక్రపాణి గారి ఆలోచనలు గుండమ్మ కోసమే వెతుకుతున్నాయ్. ఓనాడు వాహిని స్టూడియోలో కూర్చొని మన సూర్యకాంతం అయితే ఎలా చేస్తుంది అని అడిగారు చక్రపాణి. ఎన్టీఆర్ నుండి సూపర్ అన్న సమాధానం. ఇంకేం ప్రొసీడ్ అన్నట్టు అక్కినేని వారి నుండి చిరునవ్వు. గుండమ్మ కథ అనే అద్భుతాన్ని మనకి అందించడానికి సూర్యకాంతం అలా రంగంలోకి వచ్చింది. షూటింగ్ మొదటిరోజునే గుండమ్మగా సూర్యకాంతం తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించింది. యన్టీఆర్, ఏయన్నార్, యస్వీఆర్, సావిత్రి, జమున వంటి ఉద్దండులను స్క్రీన్ పై మింగేస్తున్న సూర్యకాంతం నటన చూసి చక్రపాణి సెట్ లోనే బిత్తరపోయారు. అప్పుడే ఆయన నాగిరెడ్డితో ఓ మాట అన్నారట. రెడ్డి.. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది. కానీ.., దానికి యన్టీఆర్, ఏయన్నార్ కన్నా.., ఈ గుండమ్మ పాత్రే ఎక్కువ కారణం అవుతుంది చూడు అని అన్నారట. ఆరోజు ఆయన అన్న మాట అక్షర సత్యంగా నిలిచిపోయింది.

gund 13) మహానటులు యన్టీఆర్- ఏయన్నార్ కాంబినేషన్ లో చాలానే మల్టిస్టారర్స్ రూపొందాయి. కానీ.., వారికి మాతం గుండమ్మ కథ చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఈ సినిమా యన్టీఆర్ కి 100వ చిత్రం. ఏయన్నార్ కి 99వ చిత్రం.

4) పౌరాణిక చిత్రాల దర్శకునిగా పేరు పొందిన కమలాకర కామేశ్వరరావు ఈ సాంఘిక చిత్రానికి దర్శకత్వం వహించి శభాష్ అనిపించుకున్నారు. నిజానికి ముందుగా ఈ సినిమాకి దర్శకుడిగా కె.వి.రెడ్డిని అనుకున్నారు. పాతాళభైరవి, మాయాబజార్ వంటి ఎనలేని రత్నాలన విజయా వారి కీర్తి కిరీటంలో పొదిగిన దర్శకుడు ఆయన. కానీ.., ఈ చిత్ర కథ తనకి నచ్చలేదని కె.వి.రెడ్డి ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు. అలా.., చివరి నిమిషంలో కమలాకర కామేశ్వరరావు ఇంతటి గొప్ప అవకాశం దక్కింది.

5) ఈ చిత్రంలో కోలో కోలో యన్న అనే పాట ఉంటుంది. ఈ పాటలో నాగేశ్వరావు, రామారావు, సావిత్రి, జమున నలుగురు నటించారు. పాట షూట్ చేసే సమయంలో హీరోలిద్దరికి ఒకేసారి సమయం చిక్కనందున.. నాగేశ్వరావు జమునపై ఒకసారి, రామారావు సావిత్రిపై ఒకసారి విడివిడిగా ఈ పాటను చిత్రీకరించారు. అయినా ఆ తేడా ఎక్కడా పాటలో మనకి కనపడదు.

6) యన్టీఆర్, ఏయన్నార్ వంటి ఇద్దరు హీరోలు. సినిమా తీసింది విజయవారు. ఇంత మంచి కాంబినేషన్ ఉన్నా.., ఈ మూవీని రిలీజ్ చేయడానికి బయ్యర్స్ ముందుకి రాలేదు. ఇద్దరు టాప్ స్టార్స్ ఉన్నా, సినిమాలో డ్రామా తప్ప ఫైట్స్ లేవన్నది వారి కంప్లైంట్. కానీ.., చక్రపాణి, నాగిరెడ్డి వెనక్కి తగ్గలేదు. రాష్ట్ర వ్యాప్తంగా సినిమాని సొంతగా రిలీజ్ చేశారు. ఫలితం విజయ వారిపై డబ్బుల వర్షం కురిసింది. నాగిరెడ్డి, చక్రపాణి తడిసి ముద్దైపోయే అంత వర్షం అది. నేటి లెక్కల్లో చెప్పుకోవాలంటే గుండమ్మ కథ అప్పటి బాహుబలి.

7) ఇక ఈ సినిమాలోని ఆణిముత్యాల్లాంటి 8 పాటలు. అన్నిటికీ పింగళి నాగేంద్రరావు రచయత. ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీతం. ఇద్దరు కలసి ఓ తపస్సులా ఈ సినిమాకి కోసం పని చేశారు. ఫలితం ఈనాటికీ గుండమ్మ కథ పాటలు ఎవర్ గ్రీన్.

8) గుండమ్మ కథ విజయంలో యన్టీఆర్ కష్టాన్ని మరచిపోలేము. అప్పటికే యన్టీఆర్ సూపర్ స్టార్. మరోవైపు తనతో పోటీగా ఉన్న ఏయన్నార్ తో కలసి చేస్తున్న సినిమా. ఇలాంటి సందర్భంలో కూడా యన్టీఆర్ అంజి పాత్రలో సినిమా అంతా నిక్కర్లో కనిపించడానికి ఒప్పుకోవడం సాహసం కాక మరేంటి? గుండమ్మ కథరిలీజ్ కి ఇంకా పదిరోజుల సమయం ఉందనగానే, ఎల్వీ ప్రసాద్ ఇంట్లో జరిగిన పెళ్ళివేడుకలో గుండమ్మ కథ సినిమాను ప్రదర్శించారు. అక్కడ ఎన్టీఆర్ నిక్కర్ లో తెరపై కనిపించగానే ప్రివ్యూ చూస్తున్న చిన్నపిల్లలంతా ఒక్కపెట్టున నవ్వేశారట.

9) గుండమ్మ కథ టైటిల్స్ విషయంలో విజయ వారికి ఓ సమస్య వచ్చి పడింది. యన్టీఆర్, ఏయన్నార్ మధ్య అప్పటికే మంచి పోటీ ఉంది. మరి టైటిల్స్ లో ఎవరి పేరు ముందు వేయాలన్నది సమస్య. దీనికి నాగిరెడ్డి చక్కటి ఉపాయాన్ని ఆలోచించారు. అసలు తెరపై పేర్లే వేయకుండా, ఫోటోలు చూపించాలని నిర్ణయించుకున్నారు. అందుకే.. గుండమ్మ కథకి టైటిల్స్ రోల్ ఉండదు. మొదట యన్టీఆర్, ఏయన్నార్, సావిత్రి, జమున, ఎస్వీ రంగారావుల ఫోటోలు తెరపై పడతాయి. తర్వాత సూర్యకాంతం, ఛాయాదేవి, రమణారెడ్డి, హరనాథ్, ఎల్.విజయలక్ష్మిల ఫోటోలు పడతాయి.

10) ఇప్పటికి గుండమ్మ కధ కచ్చితంగా మంచి విజయం సాదించగల చిత్రం. ప్రతి డైరెక్టర్ రీమేక్ చేయడానికి ఇష్ట పడే చిత్రం. ప్రతి నిర్మాత డబ్బులు పెట్టడానికి ముందుకొచ్చే చిత్రం. ప్రతి నటీనటులు నటించాలనుకునే చిత్రం. జూనియర్ యన్టీఆర్, నాగచైతన్య కనుక కాస్త సాహసించి ముందుకి వస్తే గుండమ్మ కథని మళ్ళీ సెట్స్ పైకి తీసుకెళ్లొచ్చు. గుండమ్మగా ఎలాగో రమ్యకృష్ణ ఉండనే ఉంది. ఫ్యాన్స్ కూడా ఈ అద్భుతాన్ని మరోసారి చూడాలి అనుకుంటున్నారు.

చూశారు కదా..? ఇవి గుండమ్మ కథ చిత్రం విశేషాలు. ఈ 60 వసంతాలకే కాదు, ఇంకో 60 వసంతాలు అయినా గుండమ్మ కథ మాత్రం తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో అజరామరమే. మరి.. గుండమ్మ కథ మూవీ మీరు చూశారా? ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.