వరంగల్ లో పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య చేసుకున్న ఘటన మరువక ముందే .. రక్షిత అనే బీటెక్ విద్యార్థిని తన బాబాయ్ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
తెలంగాణలో గంటల వ్యవధిలోనే రెండు దారుణ సంఘటనలు చోటుచేసుకున్నాయి. వరంగల్ లో పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య చేసుకున్న ఘటన మరువక ముందే .. రక్షిత అనే బీటెక్ విద్యార్థిని తన బాబాయ్ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తొలుత రక్షిత ర్యాగింగ్ భూతానికి బలైందని అందరు అనుకున్నారు. కానీ రక్షిత మరణం వెనుక ప్రేమ వేధింపులు ఉన్నాయి అని తాజాగా వెలుగు చూశాయి. రాహుల్, జస్వంత్ అనే యువకుల బ్లాక్ మెయిల్ కారణంగానే రక్షిత మరణించినట్లు తెలిసింది. దాంతో వారిద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
సరదాగా స్నేహితుడితో దిగిన ఫోటోలే ఓ యువతి ప్రాణాలను బలిగొన్నాయి. భూపాలపల్లికి చెందిన రాహుల్ అనే యువకుడు రక్షితకు పదోతరగతి నుంచి పరిచయం. దాంతో గత కొంత కాలంగా రాహుల్ ఆమెను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఈ క్రమంలోనే రక్షితతో దిగిన ఫోటోలను మరో యువకుడు జస్వంత్ కు పంపాడు. దాంతో వీరిద్దరు ఆమెను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించారు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తామని చెప్పడంతో.. మనస్తాపానికి గురైంది రక్షిత. ఈ విషయమై తన బాబాయ్ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులు రాహుల్, జస్వంత్ లను అరెస్ట్ చేశారు.