ఉపాధ్యాయుల నియామకానికి ముందు నిర్వహించే టెట్(ఉపాధ్యాయ అర్హత పరీక్ష) నోటిఫికేషన్ ను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. మార్చి 26 నుంచి ఏప్రిల్ 12 వరకు ఆన్ లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. జూన్ 12వ తేదీన టెట్ పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత టెట్ పరీక్ష నిర్వహించడం ఇది మూడోసారి. గతంలో 2016 మే, 2017 జులైలో నిర్వహించారు. ఐదేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు మూడోసారి టెట్ పరీక్ష నిర్వహించనున్నారు.
DSC ముందు నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)పై తెలంగాణ ప్రభుత్వం కీలక జీవో జారీ చేసింది. ఒకసారి టెట్ పరీక్షలో అర్హత సాధిస్తే.. అది జీవితకాలం వర్తిస్తుందని తెలిపింది. గతంలో ఒకసారి టెట్‌లో అర్హత సాధిస్తే ఆ ధ్రువపత్రానికి ఇప్పటివరకు ఏడేళ్ల కాలపరిమితి ఉండేది. ఆ తర్వాత దానికి విలువ ఉండదు. మళ్లీ టెట్ రాసుకోవాల్సిందే. అందుకు భిన్నంగా ఒకసారి టెట్‌లో అర్హత సాధిస్తే జీవితాంతం విలువ ఉండేలా మార్పు చేయాలని NCET రెండేళ్ల క్రితమే నిర్ణయించింది. ఈ క్రమంలో విద్యాశాఖ ఆ ప్రకారం మార్పు చేసింది.
ఇదే సమయంలో మరొక కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు బీఈడీ అభ్యర్థులు 6-10 తరగతులు బోధించేందుకు మాత్రమే అర్హులు. అందుకు టెట్‌లో పేపర్-2 రాసేవారు. ఇక నుంచి వారు 1-5 తరగతులకు బోధించేందుకు SGTలుగా నియమితులు కావొచ్చు. అంటే వారు టెట్‌లో పేపర్-1 రాయవచ్చు. కాకపోతే ఉద్యోగంలో చేరిన రెండేళ్లలోపు ప్రాథమిక విద్య బోధనలో ఆరు నెలల బ్రిడ్జి కోర్సు పూర్తి చేయాలి. ఇప్పటివరకు పేపర్-1కు కేవలం DEd వారు మాత్రమే అర్హులు. తాజా నిర్ణయంతో బీఈడీ అభ్యర్థులు కూడా ఎస్జీటీ పోస్టుకు అర్హులు. టెట్‌లో వచ్చిన మార్కులకు ఉపాధ్యాయ నియామకాల్లో భాగంగా నిర్వహించే పరీక్షలకు 20 శాతం వెయిటేజీ ఇచ్చి ర్యాంకు కేటాయిస్తారు.ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను సాధ్యమైనంత త్వరగా నిర్వహించాలని తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా బుధవారం పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలిని ఆదేశించారు. 2015 డిసెంబరు 23న టెట్‌కు సంబంధించి జారీ చేసిన జీఓ 36లో ప్రధానంగా రెండు సవరణలు చేస్తూ ప్రభుత్వం తాజాగా జీఓ 8 ఇచ్చింది. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సీటీఈ) మార్గదర్శకాల ప్రకారం ఈ మార్పులు చేశారు. మరి.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.