తొమ్మిది నెలల పాటు తండ్రి కాబోతున్న సంతోషాన్ని పొంది.. పుట్టిన బిడ్డను అపురూపంగా చేతుల్లోకి తీసుకుని మురిసిపోతాడు తండ్రి. ఈ ఆనందకర సమయం ఎలాంటి వ్యక్తికైనా, ఏ స్థాయి వారికైన సహజం. ఇలాంటి సంతోషాన్ని కొన్ని రోజుల క్రితమే ఆస్వాదించి, మహాలక్ష్మి పుట్టిందనే పట్టరాని ఆనందంతో తన కల సాకారం చేసుకునేందుకు రంజీ ట్రోఫీకి సిద్ధమయ్యాడు వర్తమాన భారత క్రికెటర్. కానీ పుట్టిన కొన్ని రోజులకే ఆ చిన్నారి మరణవార్త విన్నాడు. గుండెలు పగిలే దుఃఖం, ముంచుకొస్తున్న కన్నీళ్లతో టోర్నీ మధ్యలోనే ఇంటికెళ్లి కన్న బిడ్డ అంతిమ కార్యక్రమాలు చేసుకుని ఆటపై తనకున్న మక్కువతో మళ్లీ తిరిగి వచ్చాడు. కూతురు పోయిన బాధను గుండెల్లోనే దిగమింగి సెంచరీతో చెలరేగాడు బరోడా క్రికెటర్ విష్ణు సోలంకి. దీంతో అతని సెంచరీపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
చండీఘడ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సోలంకి ఈ సెంచరీ సాధించాడు. పుట్టిన బిడ్డను కోల్పోయి కూడా సెంచరీతో మెరిసి ఔరా అనిపించిన విష్ణు సోలంకిని యావత్ క్రికెట్ ప్రపంచం మెచ్చుకోకుండా ఉండలేకపోతుంది. ”తీర్చలేని దుఃఖాన్ని దిగమింగి.. సూపర్ ఇన్నింగ్స్ ఆడావు.. హ్యాట్సాఫ్ అంటూ సోషల్ మీడియాలో క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన విష్ణు సోలంకి 161 బంతులెదుర్కొని 12 బౌండరీల సాయంతో సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. సోలంకి సెంచరీ పూర్తి చేసుకున్న కాసేపటికే ఆట రెండో రోజు పూర్తైంది. ప్రస్తుతం బరోడా తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 398 పరుగులు చేసింది. అంతకముందు చంఢీఘడ్ తొలి ఇన్నింగ్స్‌లో 168 పరుగులకే ఆలౌట్ అయింది. ఇప్పటికే బరోడా తొలి ఇన్నింగ్స్‌లో 230 పరుగుల ఆధిక్యంలో ఉండడం విశేషం. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2022 సీజన్ మెగావేలంలో ఆల్‌రౌండర్ అయిన విష్ణు సోలంకిని తీసుకునేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తి కనబర్చలేదు.
Unreal commitment from Vishnu Solanki who lost his newborn daughter a few days back.#ranjitrophy2022 #CricketTwitter pic.twitter.com/5mwOaD06oc
— CricTracker (@Cricketracker) February 25, 2022