ప్రతిష్టాత్మకమైన యాషెస్ లో బ్యాటింగ్, బౌలింగ్ లోనే కాదు ఫీల్డింగ్ లోనూ అభిమానులకి మంచి కిక్ ఇస్తుంది. రెండో రోజు ఆటలో భాగంగా ఇంగ్లాండ్ ప్లేయర్ పట్టిన ఒక అద్భుతమైన క్యాచ్ కారణంగా ఆసీస్ బ్యాటర్ పెవిలియన్ బాట పట్టాడు.
యాషెస్ లో భాగంగా ఐదవ టెస్టు రసవత్తరంగా సాగుతుంది. తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ బౌలర్లు విజ్రంభించడంతో కేవలం 283 పరుగులకే పరిమితమైంది. ఆ తర్వాత మేమేం తక్కువ కాదంటూ ఇంగ్లాండ్ బౌలరు కూడా చెలరేగడంతో ఆసీస్ 295 మాత్రమే చేయగలిగింది. వికెట్ నష్టానికి 61 పరుగులతో రెండో రోజు ఆట కొనసాగించిన కమ్మిన్స్ సేనకు ఇంగ్లాండ్ బౌలర్లు చుక్కలు చూపించారు. ఇంగ్లీష్ బౌలింగ్ ధాటికి ఒక దశలో 185 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే అప్పటికే కుదురుకున్న స్టీవ్ స్మిత్ (71) జట్టు స్కోర్ ని 200 పరుగులు దాటించాడు. చివర్లో కెప్టెన్ కమ్మిన్స్(36), మర్ఫీ(34) బ్యాట్ ఝళిపించడంతో ఆసీస్ జట్టుకి 12 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. నువ్వా నేనా అనేట్లుగా సాగుతున్న ఈ టెస్టు మ్యాచులో రెండో రోజు ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు జో రూట్ పట్టిన క్యాచ్ హైలెట్ గా నిలిచింది. యాషెస్ చరిత్రలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాచ్ గా నిలిచింది.
కీలక దశలో ఒక్క గ్రేట్ క్యాచ్ పడితే ఆ కిక్కే వేరు అనేలా ఉంటుంది. రూట్ పట్టిన ఒక్క క్యాచ్ వల్ల ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్ వరుసపెట్టి కుప్పకూలింది. ఇక వివరాల్లోకెళ్తే..రెండో రోజు ప్రారంభంలో ఆసీస్ బ్యాటర్లు లబుషేన్, ఖవాజా పరుగులు చేయడానికి బాగా ఇబ్బంది పడ్డారు. ఒక దశలో పరుగులు చేయడం మానేసి కేవలం డిఫెన్స్ కే పరిమితమయ్యారు. దీంతో కంగారూల బ్యాటింగ్ నత్త నడకన సాగింది. అయితే కట్టుదిట్టంగా బౌలింగ్ వేస్తున్నా వికెట్లు రాకపోవడంతో ఇంగ్లాండ్ అసహనానికి గురైంది. ఎలాగైతేనేం క్రీజ్ లో పాతుకుపోయిన ఈ జోడీని మార్క్ వుడ్ విడదీసాడు. అయితే మార్క్ వుడ్ కి వికెట్ పడినా ఈ వికెట్ రూట్ పట్టిన అద్భుతమైన క్యాచ్ వలనే సాధ్యమైంది. ఇన్నింగ్స్ 43 ఓవర్లో ఐదో బంతిని వుడ్ ఆఫ్ స్టంప్ దిశగా వేసాడు. ఈ బంతిని అడ్డుకునే క్రమంలో మార్నస్ లాబుస్చాగ్నే బ్యాట్ ఎడ్జ్ తీసుకొని వికెట్ కీపర్, ఫస్ట్ స్లిప్ మధ్యలో నుంచి వెళ్తుండగా రూట్ ఎడమవైపు సూపర్ డైవ్‌తో బంతిని సింగిల్ హ్యాండ్‌తో అద్భుతంగా అందుకున్నాడు.
సాధారణంగా కుడివైపు డైవ్ వాలు ఉండే ఆటగాళ్లకు ఇలా ఎడమ వైపు డైవ్ చేయడం సామాన్యమైన విషయం కాదు. డైవ్ చేసి కూడా సింగిల్ హ్యాండ్ తో క్యాచ్ ని అందుకున్నాడు. దీంతో లబుషేన్ కి కాసేపు ఏం జరిగిందో అర్ధం కాలేదు. నిరాశగానే పెవిలియన్ వైపుగా వెళ్ళాడు. ప్రస్తుతం రూట్ ఫీల్డింగ్ విన్యాసానికి అభిమానులు ఫిదా అవుతుండగా ఈ సిరీస్ లో ఇదే బెస్ట్ క్యాచ్ అని కొందరు కొనియాడుతున్నారు. సూపర్ క్యాచ్‌తో జిడ్డుగా ఆడుతున్న లబుషేన్‌ను ఔట్ చేసి పుణ్యం కట్టుకున్నాడని కామెంట్ చేస్తున్నారు. రూట్ స్లిప్ లో ఇలాంటి క్యాచులు గతంలో అందుకున్నా.. ఎడమవైపుకు డైవ్ అందుకున్న ఈ క్యాచ్ ని ప్రశంసించాల్సిందే. మరి రూట్ పట్టిన ఈ క్యాచ్ మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.
🎶 Come on, Woody, let’s go party (ah ah ah yeah) 🎶 #EnglandCricket | #Ashes pic.twitter.com/5UewujrAmM
— England Cricket (@englandcricket) July 28, 2023