ఈ కాలంలో పెళ్లి చేసుకోవడానికి అబ్బాయిలకు అమ్మాయిలు దొరకడం కష్టమైపోయింది. ఎందుకంటే భారత్ లో ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు 876 మంది అమ్మాయిలు మాత్రమే ఉన్నారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. దీంతో అబ్బాయిలు పెళ్లి సంబంధాల కోసం వెతికి వెతికి అలిసిపోతున్నారు. పైగా ఈ కాలం అమ్మాయిలు బాగా చదువుకుని, తమకు ఎలాంటి అబ్బాయి కావాలో వాళ్లే నిర్ణయించుకుంటున్నారు. ఇదిగో ఇలా చాలా మంది అబ్బాయిలు పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి దొరకక ఇబ్బంది పడుతుంటే.. కర్ణాటకలో మాత్రం ఓ అబ్బాయి ఏకంగా ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు. అది కూడా ఒకే ముహూర్తానికి ఇద్దరిని పెళ్లి చేసుకుని అందరిని ఆశ్చర్యపరిచాడు. ఈ అబ్బాయి పెళ్లి చేసుకున్న వాళ్లు ఇద్దరు సొంత అక్కా చెల్లెళ్లను. కర్ణాటక ముళబాగు తాలుకాలోని వెగమడుగు గ్రామానికి చెందిన ఉమాపతికి సమీప బంధువైన లలితో పెళ్లి నిశ్చయమైంది. ఐతే ఉమాపతిని పెళ్లి చేసుకునేందుకు అమ్మాయి లలిత ఓ కండీషన్ పెట్టింది.
మాటలు రాని తన చెల్లెలు సుప్రియను కూడా పెళ్లి చేసుకోవాలని షరతు విధించింది. లలిత కండీషన్ కు అబ్బాయి ఉమాపతితో పాటు, ఇరు కుటుంబాల బంధువులు షాక్ తిన్నారు. ఆ తరువాత తన మూగ చెల్లిని ఎవరు పెళ్లి చేసుకోరని, అందుకే ఈ కండీషన్ పెట్టానని ఆ అమ్మాయి చెప్పడంతో అంతా ఒప్పుకున్నారు. ఇంకేముంది ఒకే ముహూర్తానికి అక్కా చెల్లెలు మెడలో తాళి కట్టాడు ఉమాపతి. కరోనా నేపధ్యంలో ఇరు కుటుంబాలకు సంబందించిన అతి కొద్ది మంది బంధువల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. ఇలా ఒకే ముహూర్తానికి ఇద్దరిని పెళ్లి చేసుకోవడంతో ఇప్పుడు ఈ వార్తతో పాటు వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. పెళ్లి కూతుళ్ల తండ్రి నాగరాజప్ప కూడా రాణియమ్మ, సుబ్బమ్మ అనే ఇద్దరు అక్కా చెల్లెళ్లను పెళ్లి చేసుకున్నాడట. వీళ్లిదరిలో కూడా ఒకరు మూగవారు కావడం మరింత ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు మళ్లీ తన కూతుళ్లను సైతం ఒకే అబ్బాయికిచ్చి పెళ్లి చేయడం యాదృఛ్చికంగా జరిగిపోయిందని చెబుతున్నాడు నాగరాజప్ప.