బిజినెస్ డెస్క్- డిజిటల్ పేమెంట్స్.. అవును ఇప్పుడు ప్రపంచమంతా ఆన్ లైన్ పేమెంట్స్ పైనే ఆధారపడింది. ఇప్పుడు ఎవ్వరు నగదును క్యారీ చేయడం లేదు. షాపింగ్ చేయాలన్నా, ఎవరికైనా డబ్బులు ఇవ్వాలన్నా, బిల్లులు చెెల్లించాలన్నా.. ఇలా ఏంచేయాలన్నా అంతా ఆన్ లైనే. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యాప్ లు వచ్చాక ఆన్ లైన్ పేమెంట్స్ మరింత సులభతరం అయ్యాయి. జస్ట్ ఫింగర్ టిప్స్ తో ప్రపంచంలో ఎక్కడికైనా డబ్బులు పంపించవచ్చు. ఇంతకు ముందులా బ్యాంకులకు వెళ్లి గంటల తరబడి క్యూలైన్ లో నిలబడాల్సిన పని అస్సలు లేదు. స్మార్ట్ ఫోనే బ్యాంకులా మారిపోయింది. కానీ ఆన్ లైన్ సేవల్లోను అప్పుడుప్పుడు అంతరాయం ఏర్పడుతుంది.
ఆన్‌లైన్ బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహించేందుకు ఉపయోగపడే నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్.. నెఫ్ట్ ను సాంకేతికంగా మరింత ఆధునికీకరించబోతున్నారు. ఈ టెక్నికల్ అప్‌గ్రెడేషన్ కోసం ఆదివారం 14 గంటలపాటు నెఫ్ట్ సేవలు నిలిచిపోబోతున్నాయి. మే 22 రాత్రి 1 గంటల నుంచి మే 23 ఆదివారం మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ సేవలు అందుబాటులో ఉండవని భారత రిజర్వ్ బ్యాంక్ స్పష్టం చేసింది. ఈ వివరాలతో ఓ నోటిఫికేషన్‌ను ఆర్బీఐ జారీ చేసింది. నెఫ్ట్ సేవలను వినియోగించుకునే బ్యాంకులు తమ కస్టమర్లకు ఈ వివరాలను తెలియజేయాలని ఆర్బీఐ తెలిపింది. కస్టమర్లు తమ లావాదేవీలను నిర్వహించుకునేందుకు ఓ ప్రణాళికను రూపొందించుకునేందుకు వీలుగా సమాచారాన్ని అందించాలని స్పష్టం చేసింది.
నెఫ్ట్ మెంబర్ బ్యాంకులకు నెఫ్ట్ సిస్టమ్ బ్రాడ్‌కాస్ట్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలియజేయనున్నట్లు వివరించింది. ఐతే రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్.. ఆర్టీజీఎస్ మాత్రం ఈ సమయంలో యథావిథిగానే కొనసాగుతుందని ఆర్బీఐ పేర్కొంది. ఆర్టీజీఎస్ ను ఏప్రిల్ 18న భారతీయ రిజర్వ్ బ్యాంక్ అప్‌గ్రేడ్ చేసింది. అందుకని ఆర్టీజీఎస్ యధావిధిగా పనిచేస్తుంది. నెఫ్ట్ మాత్రం తిరిగి 23 మద్యాహ్నం 2 గంటల తరువాత నుంచి పనిచేయనుంది. నెఫ్ట్ ద్వార ఆన్ లైన్ లావాదేవీలు చేసే వారు ఈ మేరకు షెడ్యుల్ చేసుకోవాలి.