కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు క్రమంగా రాష్ట్రాలు లాక్డౌన్ బాట పడుతున్నాయి.. లాక్డౌన్, మినీ లాక్డౌన్, నైట్ కర్ఫ్యూ, వీకెండ్ లాక్డౌన్ లాంటి చర్యలకు దిగుతున్నాయి. కరోనా కేసులు వేగంగా పెరుగుతుండటంతో గోవా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాత్రి కర్ఫ్యూ సహా పలు ఆంక్షలు విధించినప్పటికీ కరోనా కేసులు పెరుగుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా పూర్తిస్థాయి లాక్డౌన్ విధించాలని గోవా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో తొలిరోజు ప్రజల కదలికలపై పోలీసులు పూర్తిస్థాయిలో దృష్టిసారించారు. వివిధ నగరాల్లోనూ ప్రజలు పూర్తిస్థాయిలో లాక్డౌన్కు సహకరించారని నార్త్ గోవా ఎస్పీ ఉతృష్ట్ ప్రసూన్ తెలిపారు. తొలిరోజు సందర్భంగా ప్రధనా కూడలన్నీ జనసంచారం లేక ఖాళీగా ఉన్నట్లు తెలపారు. మిగతా రెండు రోజుల్లోనూ లాక్డౌన్ను పటిష్టంగా అమలు చేస్తామని ప్రజలెవరూ అనవసరంగా బయట తిరగవద్దని కోరారు. అందరి సహకారంతో అతి త్వరలోనే కరోనాను అంతమొందించగలమని ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా రెండో దశ చాలా ప్రమాదకరమైనదని పేర్కొన్న గోవా సీఎం ప్రమోద్ సావంత్.. ఏప్రిల్-29 సాయంత్రం నుండి మే-3 ఉదయం వరకు గోవాలో లాక్ డౌన్ అమల్లో ఉంటుందని ప్రకటించారు. ప్రజలెవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. గ్రాసరీ స్టోర్ లు,అత్యవసర సేవలు,పారిశ్రామిక కార్యకలాపాలకు లాక్డౌన్ నుంచి మినహాయింపు ఉంటుందని సీఎం తెలిపారు. అదేవిధంగా అత్యవసర వస్తువుల రవాణా కోసం రాష్ట్ర సరిహద్దులు తెరిచే ఉంటాయన్నారు కానీ, ప్రజారవాణా మూతపడుతుందన్నారు. క్యాషినోలు, హోటళ్లు, పబ్లు కూడా మూసే ఉంటాయని చెప్పారు.లాక్డౌన్ సమయంలో అవసరమైన సేవలు, పారిశ్రామిక కార్యకలాపాలు మాత్రమే పనిచేయడానికి అనుమతించబడతాయని సిఎం చెప్పారు. అంతేకాకుండా ఆగస్టు10 వరకు ప్రతిరోజూ రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు జనతా కర్ప్యూ కొనసాగనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రజలు స్వచ్ఛందంగా లాక్డౌన్ పాటించాలని కోరారు.