గత కొంత కాలంగా దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజు రోజు కీ పెరిగిపోతూనే ఉన్నాయి. రోడ్డు భద్రతా చర్యలు పాటించాలని ఎన్ని సార్లు చెప్పి కొంత మంది డ్రైవర్ల నిర్లక్ష్యం ఈ ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం రాత్రి ఓ వ్యక్తి అంతిమ సంస్కారాలను నిర్వహించేందుకు వెళ్తున్న క్రమంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆపిఉన్న ట్రక్కును ప్రయాణికులతో వెళ్తున్న వ్యాన్ ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో వాహనం డ్రైవర్‌తో సహా మొత్తం 18 మంది మరణించారు. మృతుల్లో 10 మంది పురుషులు ఉండగా.. ఆరుగురు మహిళలు, ఇద్దరు మైనర్లు ఉన్నారు. నార్త్ 24 పరగణాస్‌లోని బాగ్దా పోలీస్ స్టేషన్ పరిధిలోని పర్మదన్ ప్రాంతంలో నివసించే వృద్ధురాలు శ్రబానీ ముహురి మరణించింది. ఆమె అంత్యక్రియలు నిర్వహించేందుకు బయలు దేరారు. మటాడోర్‌లోని నవద్వీప్ శ్మశానవాటికకు వెళ్తున్న క్రమంలో వ్యాన్.. ఆగిఉన్న ట్రక్కును ఢీకొట్టింది.
ఈ ఘటనలో పలువురు అక్కడికక్కడే మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అతివేగంతోపాటు దట్టంగా కురుస్తున్న మంచే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక మృతి చెందిన కుంటుంబాలకు ఆ రాష్ట్ర సీఎం ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.