సాధారణంగా ఉన్నతాధికారులను ఎవరైనా సార్, మేడమ్ అని పిలుస్తుంటారు… అది వారికి ఇచ్చే గౌరవం. అయితే ఈ పిలుపు పిలిచేందుకు గ్రామస్థాయిలో ఉన్నవారు ఇబ్బందులు పడుతున్నారని.. దాని వల్ల అధికారులకు ప్రజలకు మద్య దూరం పెరుగుతుందని భావించిన కేరళలోని ఓ గ్రామం ఆ పదాలను నిషేధించింది. ఇకపై అక్కడ చేటన్ (అన్న), చేచి (అక్క) అని పిలిస్తే సరిపోతుందంటూ ఉత్తర కేరళ జిల్లాలోని మథుర గ్రామ పంచాయతీ కొత్త నిబంధన తీసుకొచ్చింది.
అధికారుల వద్ద గ్రామ ప్రజలు ఆ పదాలు వాడటానికి ఇబ్బంది పడుతున్నారని.. తమ సమస్యలు చెప్పేందుకు ధైర్యం చేయలేకపోతున్నారని.. గ్రామ పంచాయతీ రాజకీయ పార్టీలకు అతీతంగా ఇటీవల ఓ సమావేశం నిర్ణయించి ఈ నిర్ణయం తీసుకుంది. ఇది కేవలం అధికారులు, ప్రజలకు మద్య దూరాన్ని చెరిపి వారి మద్య ఆత్మీయ సంబంధం ఏర్పాటు చేయడం కోసమే తీసుకున్న నిర్ణయం తీసుకున్నట్లు మథుర పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ తెలిపారు. అయితే ప్రజాస్వామ్యంలో ప్రజలే కీలకమని, ప్రజలకు వారు సేవకులని పేర్కొన్నారు. కాబట్టి వారికి మర్యాద ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. ప్రజలకు ప్రభుత్వ రంగంలో పనిచేసే ఏ అధికారైనా పని చేయాల్సిందే.. వారిని అభ్యర్థించకుండా డిమాండ్ చేయాలన్నారు.
ఇక గౌరవ పదాలను తొలగించిన అనంతరం ఆ విషయాన్ని తెలియజేస్తూ పంచాయతీ బయట నోటీసులు కూడా అంటించారు. ఒకవేళ ఏ అధికారి అయినా దీనికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే.. సమస్యలు పరిష్కరించకుంటే వారిపై ప్రెసిడెంట్‌కు ఫిర్యాదు చేయొచ్చన్నారు. ప్రజలు కూడా అధికారులతో మమేకమైన వారి గౌరవానికి భంగం కలిగే పనులు చేయవొద్దని అన్నారు. అధికారులతో గౌరవంగా ఉంటూ వారితో పనులు చేయించుకోవాలని సూచించారు. అలాగే, ప్రతి అధికారి వద్ద వారి నేమ్ బోర్డులను ఏర్పాటు చేశారు. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం దేశంలోని తొలి గ్రామంగా రికార్డులకెక్కింది.