కేరళ రాష్ట్రంలో మరోమారు కుంభవృష్టి కురుస్తుంది. అక్టోబర్ 16 తెల్లవారుజాము నుండి కేరళలో భారీ వర్షం కురుస్తోంది, దీని వలన అనేక జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో ఐదు జిల్లాలకు భారీ వర్ష హెచ్చరికను జారీచేశారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఈ సాయంత్రానికి ఉత్తరాది జిల్లాల్లో వర్ష తీవ్రత మరింత పెరుగుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) పేర్కొంది. ఈ మేరకు ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.
కుటిక్కల్ ప్రాంతంలో వరద కారణంగా ఏడుగురు వ్యక్తులు గల్లంతయ్యారు. కొట్టాయంలో వరద నీటిలో ఓ బస్సు మునిగిపోయింది. వెంటనే అలర్ట్ అయిన స్థానికులు బస్సులో ఉన్నవారిని సురక్షితంగా రక్షించారు. ఇడుక్కి జిల్లాలోని మలంకర డ్యామ్ కు వరద పోటెత్తడంతో గేట్లు ఎత్తేందుకు కలెక్టర్ అనుమతి మంజూరు చేశారు. అటు, ఎర్నాకుళం జిల్లాలో మువట్టుపుళ నది ఉగ్రరూపం దాల్చింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. ఇదే సమయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తుంది. కేరళలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇప్పటికే జనజీవనం అతలాకుతలం అవుతుంది.
ఈ క్రమంలోనే రాష్ట్రంలోని ఏడు జిల్లాలలో, వాతావరణ శాఖ కార్యాలయం ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది, ఈ జిల్లాలలో భారీ వర్షం పడే అవకాశం ఉందని సూచిస్తుంది. నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని అధికారులు స్పష్టం చేశారు. గతంలో వరద అనుభవాలు దృష్టిలో ఉంచుకుని ప్రజలు హడలిపోతున్నారు. కాగా, రాష్ట్రంలో భారీ వర్షాలపై సీఎం పినరయి విజయన్ ఈ మధ్యాహ్నం 3 గంటలకు సమీక్ష చేపట్టనున్నారు.