సూపర్ కింగ్స్ అదిరిబోయే బోణీ కొట్టింది. అదేంటి ఐపీఎల్ ఐపోయి చాలా రోజులు అయిన తర్వాత సూపర్ కింగ్స్ శుభారంభమేంటి అనుకుంటున్నారా!
ఓపెనర్ కాన్వే (37 బంతుల్లో 55; 7 ఫోర్లు, ఒక సిక్సర్), మిడిలార్డర్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ (42 బంతుల్లో 61; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధశతకాలతో ఆకట్టుకోవడంతో సూపర్ కింగ్స్ బోణీ కొట్టింది. అదేంటి ఐపీఎల్-16వ సీజన్ ముగిసి రెండు నెలలు కావొస్తుంటే.. ఇప్పుడు ధోనీ సేన శుభారంభం చేయడమేంటి అనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్లే! మనం మాట్లాడుకునేది ఇండియన్ ప్రీమియర్ లీగ్ గురించి కాదు. అమెరికన్ క్రికెట్ ఎంటర్ ప్రైజెస్ తొలిసారి నిర్వహిస్తున్న ‘మేజర్ క్రికెట్ లీగ్’ (ఎంసీఎల్) గురించి! మినీ ఐపీఎల్‌గా పిలుచుకుంటున్న ఈ టీ20 లీగ్‌లో 6 ఫ్రాంచైజీలు బరిలో ఉండగా.. వాటిలో మూడు జట్ల యజమానులు మన ఐపీఎల్ వాళ్లే. చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం.. టెక్సాస్ సూపర్ కింగ్స్ పేరుతో జట్టును ప్రవేశ పెట్టగా.. కోల్‌కతా నైట్ రైడర్స్ యాజమాన్యం.. లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్ పేరుతో జట్టును దింపింది. ఇక ఐపీఎల్లో ఐదు టైటిల్స్ నెగ్గి విజయవంతమైన జట్టుగా గుర్తింపు సాధించిన ముంబై ఇండియన్స్.. ఎంఐ న్యూయార్క్ పేరిట జట్టును కొనుగోలు చేసుకుంది. వీటితో పాటు వాషింగ్టన్ ఫ్రీడమ్, శాన్ఫ్రాన్సిస్కో యూనికార్న్స్, సియాటెల్ ఆర్కాస్ పేరిట మరో మూడు జట్లు పోటీ పడుతున్నాయి.
శుక్రవారం జరిగిన మేజర్ క్రికెట్ లీగ్ తొలి మ్యాచ్‌లో ఫాఫ్ డుప్లెసిస్ సారథ్యంలోని టెక్సాస్ సూపర్ కింగ్స్ 69 పరుగుల తేడాతో లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్‌ను చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. కాన్వే, మిల్లర్ అర్ధశతకాలు సాధించగా.. డ్వేన్ బ్రేవో (16 నాటౌట్; 2 సిక్సర్లు), మిషెల్ శాంట్నర్ (21; 2 సిక్సర్లు) విలువైన పరుగులు రాబట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో నైట్ రైడర్స్ 14 ఓవర్లలో 112 పరుగులకు ఆలౌటైంది. విండీస్ విధ్వంసక వీరుడు ఆండ్రూ రస్సెల్ (34 బంతుల్లో 55; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసం సృష్టించినా తక్కినవాళ్లంతా చేతులెత్తేయడంతో లాస్ ఏంజిల్స్ జట్టుకు పరాజయం తప్పలేదు. అండర్-19 స్థాయిలో భారత జట్టుకు ప్రపంచకప్ అందించిన ఓపెనర్ ఉన్ముక్త్ చంద్ ఈ లీగ్‌లో నైట్ రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. గప్టిల్ (0), ఉన్ముక్త్ (4), రాసో (4), నితీశ్ కుమార్ (0) విఫలమవడంతో నైట్ రైడర్స్ 20 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో రస్సెల్ మెరుపులు మెరిపించినా.. అతడికి సహచరుల నుంచి సహకారం లభించకపోవడంతో లాస్ ఏంజిల్స్‌కు పరాజయం తప్పలేదు. మిల్లర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్8 అవార్డు దక్కింది.