అహ్మదాబాద్- కరోనా వైరస్.. దీనికి బలవంతులు, బలహీనులు అన్న బేదం లేదు. ఎవ్వరి మీద అయినా అలవోకగా దాడి చేస్తోంది. దాడీ చేయడమే కాదు మట్టి కరిపిస్తోంది. కరోనా బారిన పడి మహా మహులే నేలకూలిపోతున్నారు. తాజాగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన బాడీ బిల్డర్ సైతం కరోనాకు బలైపోయాడు. జాతీయ స్థాయిలో బాడీ బిల్డింగ్‌లో ఎన్నో రికార్డులు సృష్టించిన కండల వీరుడు సిద్ధార్ధ్ చౌదరిని అంతా ఉక్కుమనిషిగా పిలుస్తారు. చిన్నప్పటి నుంచే సిధ్దార్ధ్ బాజీ బిల్డింగ్ పై ఆసక్తితో ఈ రంగంలోకి వచ్చాడు. అహ్మదాబాద్ చెందిన చౌదరి చాలా సంవత్సరాలుగా బాడీ బిల్డింగ్ క్రీడలో ఉన్నాడు. కొన్ని నెలల క్రితం సూరత్‌లో జరిగిన మిస్టర్ గుజరాత్ పోటీలో అతను రన్నరప్‌గా నిలిచాడు. అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనాలని ప్రయత్నిస్తున్న సమయంలోనే ఇలా జరిగింది.
గత రెండు వారాల క్రితం చౌదరి కరోనా మహమ్మారి బారినపడ్డారు. అలాంటి సిద్ధార్ధ్ కూడా ఆఖరికి కరోనాతో బారిన పడి మృత్యు వాతపడ్డాడు. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. కేవలం 30 సంవత్సరాల వయసులోనే సిద్ధార్ధ్ చౌదరి కరోనా సోకి చనిపోవడం అందరిని కలిచివేస్తోంది. గత మూడు రోజుల్లో కరోనాతో మరణించిన రెండవ బాడీ బిల్డర్ చౌదరి కావడం గమనార్హం. సిధ్దార్ధ్ చౌదరి మరణానికి గుజరాత్ బాడీబిల్డింగ్ అసోసియేషన్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది.