విశాల విశ్వంలో జీవజాతి మనుగడకు అనుకూలమైన గ్రహం భూమి ఒక్కటే.. అయితే ఈ భూమి గురించి మనిషికి పూర్తిగా తెలుసా అంటే.. కచ్చితంగా తెలియదు అనే చెప్పవచ్చు. మానవ మేధస్సుకు అందని.. సైన్స్ కూడా వివరించలేని ఎన్నో అద్భుతాలు, మిస్టరీలు భూమ్మీద ఉన్నాయి. వాటికి సంబంధించిన పుట్టపూర్వోత్తరాలు ఏవి కూడా మనకు తెలియవు. అయితే భూమ్మీద ఉన్న ఇలాంటి అద్భుతాలను చూడటం అందరికి సాధ్యం కాదు. ప్రస్తుతం ఇంటర్నెట్ వల్ల.. వీటి గురించి తెలుసుకోగలుగుతున్నాం.. వీడియోల రూపంలో అయినా చూడగలుగుతున్నాం. అలాంటి వింతల్లో ఒకటి.. గేట్స్ ఆఫ్ హెల్.. అంటే నరకానికి ముఖద్వారం. నరకం ఏంటి.. దాని ముఖ ద్వారం భూమ్మీద ఉండటం ఏంటి అనిపిస్తుందా… అయితే ఒకసారి ఇది చదవండి.. మీకే అర్థం అవుతంది.
తుర్క్ మెనిస్తాన్ దేశంలోని ఎడారిలో దర్వాజా అనే గ్రామం ఉంది. ఆ గ్రామానికి సమీపంలోనే ఓ గ్యాస్ క్రేటర్ ఉంది.. దీన్ని చాలా మంది నరకానికి ముఖద్వారం అంటే గేట్స్ ఆఫ్ హెల్ అని చెప్పుకుంటారు. అందుకు ఓ కారణం ఉంది. ఏంటంటే.. దర్వాజా గ్రామ సమీపంలో ఉన్న భారీ గొయ్యిలో నుంచి నిరంతరం మంటలు వెలువడుతూనే ఉంటాయి. స్థానికులు వందల సంవత్సరాల నుంచి ఈ బిలం ఇలా మండుతూనే ఉంది అంటుంటే.. అధికారిక నివేదికలు మాత్రం గత 50 ఏళ్లుగా.. బిలం నుంచి మంటలు వస్తూనే ఉన్నాయి అని తెలుపుతున్నాయి. ఇక్కడ ఓ ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే.. అసలు ఈ బిలం ఎలా ఏర్పడింది అనే విషయంపై ఇప్పటి వరకు ఏకాభిప్రాయం లేదు. అసలు ఇది ఎలా ఏర్పడిందో.. ఎంత కాలం నుంచి మండుతూనే ఉందో సరిగా ఎవరికి తెలియదు. మనుషులు దీన్ని గుర్తించినప్పటి నుంచి మాత్రం ఇది మండుతూనే ఉన్నట్లు తెలిపారు. ఈ బిలం 226 అడుగుల వెడల్పుతో, 98 అడుగుల లోతుతో ఉంటుంది.
ఈ బిలం వెలుగు చూసిన ప్రాంరభంలో చాలా మంది నరకం నేలపైకి వచ్చిందా ఏంటి అని భయపడ్డారు. ఇక ఈ బిలం.. ఎంతో మంది భూ విజ్ఞాన శాస్త్రవేత్తలకు పర్యాటక ప్రదేశంగా.. వారి పరిశోధనల గమ్యస్థానంగా మారింది. ఇప్పటి వరకు కూడా.. ఈ బిలం ఎప్పుడు ఏర్పడిందో చెప్పే.. సరైన నివేదికలు లేవు. కానీ 1960 ప్రాంతంలో ఈ బిలం ఏర్పడి ఉండవచ్చని భావిస్తున్నారు. అంతేకాక సోవియట్ యూనియన్‌కు చెందిన ఇంజనీర్లు దీన్ని సృష్టించారని ప్రచారంలోఉంది. అయితే కొంతమంది మాత్రం ఇది సహజంగానే భూమిలోకి కుంగిపోవడం వల్ల ఏర్పడిందని అంటున్నారు. ఈ బిలం సహజ వాయువు క్షేత్రం. అంటే దాన్నుంచి సహజవాయువు ఉత్పత్తి అవుతూనే ఉంటుంది. అందుకే ఆ మంటలు ఆగకుండా మండుతూనే ఉంటాయి.
అయితే తుర్క్ మెనిస్తాన్ ప్రభుత్వం చుట్టుపక్కల గ్రామాల పర్యావరణం, ప్రజారోగ్యంపై ఈ మంటలు ప్రతికూల ప్రభావాలను చూపిస్తాయని అంచనా వేసింది. ప్రజల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని.. ఎలా అయినా సరే బిలం నుంచివెలువుడుతున్న మంటలను ఆర్పివేయాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. కానీ ఇప్పటి వరకు అవి కార్యరూపం దాల్చలేదు. మరి భవిషత్తులో ఆ దిశగా ప్రయత్నాలు చేస్తారో లేదో తెలియదు. ప్రస్తుతానికైతే.. ఆ బిలం మండుతూనే ఉంది. దీన్ని చూడ్డానికి నిత్యం వేలాదిగా పర్యాటకులు వస్తుండడంతో ఆ దేశానికి ఆదాయం వస్తుంది. కొంతమంది సాహసవంతులైన పర్యాటకులు.. ఈ బిలంలోకి ప్రవేశించడానికి ప్రయత్నాలు చేశారు. 2013లో గ్రీకు దేశానికి చెందిన జార్జ్ కౌర్వనిస్ అనే వ్యక్తి బిలం దిగువకు వెళ్లాడు. అతడు చేసిన సాహసయాత్రను.. నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ ప్రసారం చేసింది. ఎవరు ఎన్ని చేసిన సరే.. ఈ బిలం ఆర్పేది ఎప్పుడో చూడాలి అంటున్నారు స్థానికులు.