రాజమౌళి.. సినిమా, సినిమాకి దర్శకుడిగా తన స్థాయిని పెంచుకుంటూ, తెలుగు సినిమాకి అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని జత చేసి క్రియేటివ్ జీనియస్ అనిపించుకుంటున్నారు.
రాజమౌళి.. సినిమా, సినిమాకి దర్శకుడిగా తన స్థాయిని పెంచుకుంటూ, తెలుగు సినిమాకి అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని జత చేసి క్రియేటివ్ జీనియస్ అనిపించుకుంటున్నారు. ‘బాహుబలి’ సిరీస్ మూవీస్‌తో టాలీవుడ్ సత్తా ఏంటనేది ప్రపంచానికి చాటి చెప్పి, తెలుగు వారు గర్వపడేలా చేశారు. ‘ఆర్ఆర్ఆర్’ తో వరల్డ్ బెస్ట్ డైరెక్టర్స్ స్టీవెన్ స్పీల్ బర్గ్, జేమ్స్ కెమరూన్ సైతం ఆశ్చర్యపోయేలా చేసి, తెలుగు ప్రేక్షకులు కాలర్ ఎగరేసుకునేలా చేశారు. అసలు తెలుగు సినిమా ఆస్కార్ ఎంట్రీ సాధిస్తుందా? మన సినిమాకి ఆస్కార్ వస్తుందా?.. కల్లో కూడా ఊహించలేం అనుకుంటే.. అకాడమీ అవార్డ్ గెలిచి చూపించారు. ట్రిపులార్ మూవీతో ఆయన క్రియట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. ఇప్పుడిప్పుడే ఆ ఫీవర్ నుండి బయటకొచ్చి కొత్త సినిమా పనులు మొదలెట్టబోతున్నారు.
ఇకపోతే ఇటీవల రాజమౌళి తండ్రి, సీనియర్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ.. జక్కన్న – మహేష్ బాబు సినిమా గురించి, ‘ఆర్ఆర్ఆర్ 2’ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ట్రిపులార్‌కి కొనసాగింపుగా పార్ట్ 2 ఉంటుందని, అయితే దాన్ని రాజమౌళి తియ్యకపోవచ్చు అని కూడా అన్నారు. RRR – రాజమౌళి, రామ్ చరణ్, రామారావు.. ఈ ముగ్గురూ లేని ట్రిపులార్ మూవీని ఊహించగలమా?. జక్కన్న కాబట్టే అంత బిగ్ స్కేల్ మీద అద్భుతంగా కథ చెప్పగలిగారు. తారక్, చరణ్ కూడా అద్భుతంగా నటించారు. అసలు వాళ్లిద్దరూ అంత టైం కేటాయించి, చెప్పింది చెప్పినట్టు చేసుకెళ్లారంటే అది కేవలం ఒక్క జక్కన్న మీద నమ్మకంతో మాత్రమేనని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి జక్కన్న లేకుండా సీక్వెలా?. ఆయన బదులు ఎవరు డైరెక్ట్ చేస్తారు? అంటే ఎస్.ఎస్.కార్తకేయ పేరు వినిపిస్తోంది. రాజమౌళి దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కబోయే ‘ఆర్ఆర్ఆర్ 2’ తో కార్తీకేయ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడట.
కార్తికేయ, రాజమౌళి సినిమాలకు డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో వర్క్ చేస్తూ ఆయనకు రైట్ హ్యాండ్‌గా ఉంటున్నాడు. అలాగే ‘బాహుబలి’ కి సెకండ్ యూనిట్ డైరెక్టర్‌గానూ చేశాడు. విదేశాల్లో ‘ఆర్ఆర్ఆర్’ స్పెషల్ స్క్రీనింగ్ నుండి ఆస్కార్ బరిలో నిలిచి గెలిచే వరకు దాని వెనుక కార్తికేయ కృషి ఎంతో ఉంది. మరి జక్కన్న లేకుండా RRR సీక్వెల్ అంటే అది కచ్చితంగా కార్తికేయ డైరెక్ట్ చేస్తాడని అంటున్నారు. ఒకవేళ కార్తికేయకు కుదరకపోతే.. బాలీవుడ్ డైరెక్టర్, ‘బ్రహ్మాస్త్ర’ ఫేమ్ అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తాడని టాక్. ‘బ్రహ్మాస్త్ర’ రిలీజ్ అప్పుడు, అయాన్ వర్క్ చూసి ఇంప్రెస్ అయిన రాజమౌళి, తనలాంటి మరో సినిమా పిచ్చోడు అయాన్ అని చెప్పారు. సో, ఇప్పటి వరకు వస్తున్న వార్తల ప్రకారం, తెలిసిన సమాచారం ప్రకారం జక్కన్న లేని ‘ఆర్ఆర్ఆర్’ సీక్వెల్ దర్శకత్వ బాధ్యతలు కార్తికేయ – అయాన్ ఇద్దరిలో ఒకరు తీసుకోనున్నారని ఫిలింనగర్ టాక్.