తమిళ సూపర్ స్టార్, ‘ఇళయదళపతి’ విజయ్ తన తల్లిదండ్రులపై చెన్నై సివిల్ కోర్డులో కేసు వేశారు. తన అనుమతిలేకుండా రాజకీయ కార్యక్రమాలకు తన పేరును వాడుతున్నారని ఆరోపిస్తూ ఆయన తల్లిదండ్రులతో పాటు మరో 11 మందిపై కేసు పెట్టారు. వివరాలు.. గత ఏడాది నవంబర్‌లో విజయ్ అభిమాన సంఘాల సమాఖ్యగా ఉన్న ‘విజయ్ మక్కల్ ఇయ్యకమ్’ ను రాజకీయ పార్టీగా కేంద్ర ఎన్నికల సంఘంలో రిజిస్టర్ చేయించినట్లు విజయ్ తండ్రి ప్రకటించారు.
పార్టీకి ప్రధాన కార్యదర్శి, కోశాధికారిగా విజయ్ తల్లిదండ్రులు ఉన్నారు. తండ్రి పెట్టిన పార్టీతో తనకు సంబంధం లేదని హీరో విజయ్ గతంలో ప్రకటించారు. . అంతేకాకుండా విజయ్ మక్కల్ ఇయక్కం పేరును గానీ, ఆ ఇయక్కం పతాకాన్ని, తన ఫొటోను వాడితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటానని ఒక ప్రకటనలో హెచ్చరించారు కూడా అయినప్పటికీ విజయ్ తల్లిదండ్రులు విజయ్ పేరును వాడుతూనే ఉన్నారు.తాజాగా విజయ్ ఫ్యాన్స్‌కు చెందిన ఓ రిజిస్టర్డ్ సొసైటీకి స్థానిక ఎన్నికల్లో పాల్గొనేందుకు, ఆయన తల్లిదండ్రులు అనుమతినిచ్చారు.
దీంతో కొందరు తాము విజయ్ అభిమానులమంటూ ఇండిపెండెంట్లుగా బరిలోకి దిగుతున్నారు. సమావేశాలను కూడా నిర్వహిస్తున్నారు. ఇలా తన పేరు రాజకీయ సమావేశాల్లో వాడుకోవటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ విజయ్ కోర్టును ఆశ్రయించారు .తన తల్లిదండ్రులతో సహా 11 మందిపై చెన్నై సివిల్ కోర్టులో ఆదివారం కేసు పెట్టారు.