కరోనా కారణంగా దెబ్బ తిన్న పరిశ్రమలో ఇప్పుడు వరుసగా విషాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా.. బాలీవుడ్ లో ఇలాంటి ఓ దారుణం చోటు చేసుకుంది. ప్రముఖ నటి, యాంకర్ మందిరా బేడి భర్త రాజ్ కౌశల్ బుధవారం ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు. రాజ్ కౌశల్ బీ-టౌన్ లో చాలా సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. ప్యార్ మే కబీ కబీ, షాదీ కా లడ్డు వంటి చిత్రాలను నిర్మించింది ఈయనే.
కెరీర్ లో ఆలస్యంగా సక్సెస్ టేస్ట్ చేసిన రాజ్ కౌశల్.. కొన్నేళ్ల క్రితమే మందిరా బేడిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఇంతేకాక ఆదర్శ భావాలున్న రాజ్ కౌశల్ పోయిన ఏడాది ఓ బాలికను దత్తత తీసుకున్నారు. ఇక గత కొంత కాలంగా ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న రాజ్ పోయిన ఏడాది కూడా ఓ శస్త్ర చికిత్స చేపించుకున్నట్టు తెలుస్తోంది. కానీ.., అంతా బాగుంది అనుకుంటున్న సమయంలో రాజ్ కౌశల్ ఇలా గుండె పోటుతో మరణించడం అందరికి షాక్ కలిగిస్తోంది.
ఇక మందిరా విషయానికి వస్తే.. పలు హిందీ చిత్రాలతో పాటు, సిరియల్స్, వెబ్ సీరిస్‌ల్లో నటించింది. దక్షిణాదిన శింబు మన్మథుడు, ప్రభాస్ సాహో చిత్రాల్లో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. ఇక క్రికెట్ కామెంటేటర్ గా కూడా మందిరా బేడి మంచి గుర్తింపు దక్కించుకోవడం విశేషం. ఏదేమైనా.. రాజ్ మృతి పట్ల బాలీవుడ్ పెద్దలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.