అతి పిన్న వయసులోనే విమానంలో ఒంటరిగా ప్రపంచాన్ని చుట్టేసిన మహిళగా రికార్డు సృష్టించడానికి 19 ఏళ్ల బెల్జియం యువతి ప్రయాణం ప్రారంభించింది. ఒకే సీటున్న విమానంలో బుధవారం ప్రయాణం ప్రారంభించిన యువతి ప్రతికూల వాతావరణ పరిస్థితులను లెక్కచేయలేదు. బెల్జియం కొర్ట్రిజ్క్‌లోని వేవెల్గమ్ విమానాశ్రయం నుంచి జారా రూథర్‌ఫోర్డ్ అనే యువతి బయలుదేరింది. బెల్జియన్-బ్రిటిష్‌కు చెందిన 19ఏళ్ల టీనేజర్ కీలక నిర్ణయం తీసుకుంది. ఒంటరిగా ప్రపంచాన్ని చుట్టేసి, ఆ ఘనత సాధించిన మహిళగా ప్రపంచ రికార్డు సృష్టించేందుకు సిద్ధం అయింది.
ఇందులో భాగంగానే తన ప్రయాణాన్ని ప్రారంభించింది. సుమారు రెండు నుంచి మూడు నెలల్లో ఐదు ఖండాలు 52దేశాల మీదుగా యాత్రను కొనసాగించేందకు బెల్జియంలోని కొర్ట్రిజ్క్‌లోని విమాన స్థావరం నుంచి సింగిల్ సీటు విమానంలో ఆమె బయల్దేరింది. ఆమె ప్రయాణానికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఈ యాత్రను జారా రూథర్‌ఫోర్డ్ విజయంతంగా పూర్తి చేస్తే అతిపిన్న వయసులో విమానంలో ప్రపంచాన్ని చుట్టేసిన మహిళగా ఆమె గుర్తింపు పొందనున్నారు.
ప్రస్తుతం ఈ రికార్డు అమెరికాకు చెందిన షాయెస్టా వయిజ్ పేరిట ఉంది. 30ఏళ్ల వయసులో ఆమె ఈ ఘనత సాధించారు. జారా తల్లిదండ్రులు ఇద్దరూ పైలట్లు కావడం విశేషం. ఆమె భవిష్యత్తులో ఆస్ట్రోనాట్ కావాలని లక్ష్యంగా పెట్టుకుంది. తాను సాహసాలను ఇష్టపడతానని, అంతరిక్షంలోకి వెళ్లడం ఎంతో సాహసంగా భావిస్తానని జారా రూథర్‌ఫర్డ్ చెప్పింది.