సమాజంలో మానవసంబంధాలు నానాటికి దిగజారిపోతున్నాయి. అక్రమ సంబంధమో, ఆస్తి తగాదానో, వ్యసనాలో, క్షణికావేశమో.. కారణం ఏదైనా ఫలితం మాత్రం మారడం లేదు. కట్టుకున్నవాళ్లైనా.. కడుపున పుట్టిన పిల్లలైనా, కన్నవారైనా ప్రాణం అంటే లెక్కే లేకుండా పోతోంది. తాజాగా తాగొచ్చి గొడవ పడుతున్నాడని భర్తను హత్య చేసిన భార్య ఘటన చూస్తే అదే అభిప్రాయానికి వచ్చేస్తారు.
విషయానికొస్తే.. వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలంలోని తండాకు చెందిన ముడావత్ రమేశ్(35), శాంతిలకు కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. పొట్టకూటి కోసం కుటుంబంతో కలిసి హైదారాబాద్ వలస వచ్చాడు. అడ్డాకూలిగా వెళ్లి వచ్చిన డబ్బుతో రమేశ్ తరచూ తాగుతూ ఉండేవాడు. ఇంటికొచ్చి భార్యతో గొడవ పడేవాడు. తాగి గొడవ పడటమే కాకుండా.. ఇంటి అద్దె, ఖర్చుల గురించి పట్టించుకునే వాడు కాదు. దీంతో పదిరోజుల క్రితం ఖాళీ చేసి స్వగ్రామానికి వెళ్లారు. నాలుగు రోజులుగా వనపర్తిలో అడ్డా కూలీగా పనికి వెళ్లడం వచ్చిన డబ్బుతో మద్యం తాగడం మొదలు పెట్టాడు.
ఆ క్రమంలోనే శనివారం మధ్యాహ్నం ఇంటికి వచ్చి భార్యతో గొడవ పడి దూషించాడు. ఆవేశానికి లోనైన శాంతి పెద్ద గుంజ తీసుకుని రమేశ్‌ను తీవ్రంగా కొట్టింది. అక్కడితో ఆగకుండా గొంతు నులిమింది. రమేశ్ చనిపోయినట్లు నిర్ధారించుకున్న తర్వాతే అతడి గొంతు వదిలింది. ఇక్కడే అసలు డ్రామా మొదలు పెట్టింది శాంతి. సాయంత్రం చుట్టుపక్కలవారికి ‘నా భర్త నిద్రపోయాడు.. ఎంత పిలిచినా లేవడం లేదు..’ అని నమ్మించింది. అసలు విషయం తెలుసుకున్న గ్రామస్థులు ఆదివారం ఉదయం పోలీసులకు సమాచారం ఇచ్చారు. హత్య ఘటనపై రమేశ్ అన్న బాలు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు శాంతిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో రమేశ్‌ను తానే చంపినట్లు శాంతి అంగీకరించింది.