వడివేలు, ఉదయనిధి స్టాలిన్, కీర్తి సురేష్, ఫాహద్ ఫాజిల్ తదితరులు ప్రధాన పాత్రల్లో, మారి సెల్వరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన పొలిటికల్ థ్రిల్లర్ మూవీ ‘నాయకుడు’ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
తమిళనాట ఎందరో ప్రతిభావంతులైన దర్శకులు ఉన్నారు. వారిలో ఒక్కొక్కొరిది ఒక్కో శైలి. సమాజంలో చోటు చేసుకునే సంఘటనలనే కథా వస్తువులుగా తీసుకుని, పేద, ధనిక వర్గాల నేపథ్యం గురించి చూపిస్తూ.. ‘పరియేరుమ్ పెరుమాళ్’ (Pariyerum Perumal), ‘కర్ణన్’ (Karnan) వంటి అద్భుతమైన సినిమాలతో ఆకట్టుకున్న మారి సెల్వరాజ్ డైరెక్ట్ చేసిన లేటెస్ట్ సెన్సేషన్ ‘మామన్నన్’. జూన్ 29న తమిళనాట విడుదలైన ‘మామన్నన్’ పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో పాటు ఉదయనిధి స్టాలిన్ కెరీర్‌లో అత్యధిక ఓపెనింగ్స్ సాధించింది.
ఈ సందర్భంగా దర్శకుడికి మినీ కూపర్ కారుని బహుమతిగా ఇచ్చాడు ఉదయనిధి స్టాలిన్. సినిమా చూసిన వారంతా ‘వడివేలులో ఇంత మంచి నటుడు ఉన్నాడా!’ అంటూ ఆశ్చర్యపోతున్నారు. దర్శకుడి ఆయన పాత్రను తీర్చి దిద్దిన విధానం, ‘మామన్నన్’ గా వడివేలు అసాధారణ నటనకు అంతా ఫిదా అవుతున్నారు. కీర్తి సురష్, ఫాహద్ ఫాజిల్ తదితరులు నటించిన ఈ చిత్రం నేడు (జూలై 14) ‘నాయకుడు’ పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
రఘువీరా (ఉదయనిధి స్టాలిన్) మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్. అతని తండ్రి తిమ్మరాజు (వడివేలు) రిజర్వ్‌డ్ నియెజకవర్గం నుంచి గెలిచిన ఎమ్మెల్యే. లీల (కీర్తి సురేష్), రఘువీరా క్లాస్‌మేట్స్. కాలేజీ రోజుల నుండి ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టమున్నా కనీసం మాట్లాడుకోరు. కాలేజీ అయిపోయిన తర్వాత లీల పేదవారికి ఉచితంగా విద్య అందించడం కోసం ఇన్‌స్టిట్యూట్ ప్రారంభిస్తుంది. కానీ దానికి అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతుంటాయి. ఇన్‌స్టిట్యూట్ బిల్డింగ్ కోసం తిమ్మారాజుని సంప్రదిస్తారు.
అప్పుడు రఘువీరా తన మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ సెంటర్‌ను లీల ఇన్‌స్టిట్యూట్ కోసం ఇచ్చేస్తాడు. అయితే ఒకరోజు కొందరు రౌడీలు బిల్డింగ్ మీద దాడి చేసి మొత్తం ధ్వంసం చేసేస్తారు. దీని వెనుక తిమ్మరాజు పార్టీకి చెందిన రత్నవేలు (ఫాహద్ ఫాజిల్) అన్న (సునీల్ రెడ్డి) హస్తం ఉందని తెలుస్తుంది. గొడవ పెద్దది కావడంతో సెటిల్ చెయ్యడానికి రత్నవేలు రంగంలోకి దిగుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది?, చిన్న సమస్యగా మొదలై, చివరకు కులాల మధ్య గొడవగా ఎలా మారింది?. రఘువీరాకి తండ్రితో ఎందుకు మాటల్లేవు?. అసలేం జరిగింది? అనేది మిగతా కథ.
మారి సెల్వరాజ్ తన గత చిత్రాల్లానే ఇందులోనూ పేద, ధనిక వర్గాల నేపథ్యం, కులం సమస్యలు వంటి అంశాలతో పాటు కాస్త పొలిటికల్ టచ్ ఇచ్చాడు. సినిమా ప్రారంభంలోనే హీరో, విలన్ ఇద్దరి సీన్లను సమాంతరంగా నడిపిస్తూ, రెండు క్యారెక్టర్లను ఒకేసారి ఎస్టాబ్లిష్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. వారి ఐడియాలజీ మధ్య వైవిధ్యాన్ని కూడా ప్రారంభంలోనే చూపిస్తాడు. ఫస్టాఫ్ అంతా క్యారెక్టర్లు, వాటి ఐడియాలజీలను ఇంట్రడ్యూస్ చేయడం, కీ క్యారెక్టర్ల మధ్య ఫేస్ ఆఫ్‌కు రెడీ చేయడంలోనే అయిపోతుంది. కానీ సెకండాఫ్ మాత్రం చాలా రేసీగా సాగిపోతుంది. పాలిటికల్ వార్, ఎత్తులు, పై ఎత్తులు ఆసక్తికరంగా సాగుతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ మెయిన్ హైలెట్ అని చెప్పొచ్చు.
ఉదయనిధి నట విశ్వరూపం చూపిస్తాడు ఈ సన్నివేశంలో. అలాగే క్లైమాక్స్ బాగా ఆకట్టుకుంటుంది. ప్రేక్షకులు ఒక మంచి ఫీల్‌తో థియేటర్ నుంచి బయటకు వస్తారు. డైలాగ్స్ ఆలోచింపజేస్తాయి. సినిమా నిడివి 2 గంటల 37 నిమిషాలు ఉంది. హీరో, హీరోయిన్ల్ ఫ్లాష్‌బ్యాక్ దగ్గర కథనం కాస్త నెమ్మదించింది. ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే కొన్ని సీన్లు, సాంగ్ కనుక ట్రిమ్ చేసుంటే ఇంకాస్త గ్రిప్పింగ్‌గా ఉండేది. ముఖ్యంగా హీరో క్యారెక్టరైజేషన్‌ని బిల్డ్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది.
ఇన్నాళ్లూ మన తెలుగు ప్రేక్షకులకు కమెడియన్‌గానే తెలిసిన వడివేలుని ఇందులో చూస్తే వెర్సటైల్ యాక్టర్ అనుకోవాల్సిందే. ఓ కొత్త వడివేలుని చూస్తాం. ప్రథమార్థం, ద్వితీయార్థంలో క్యారెక్టర్‌కి తగ్గట్టు ఆయన నటించిన విధానం మంత్రముగ్దులను చేస్తుంది. ఫాహద్ ఫాజిల్ ఎంత మంచి యాక్టరో కొత్తగా చెప్పక్కర్లేదు. తన కెరీర్‌లోని బెస్ట్ పర్ఫార్మెన్సెస్‌లో ఈ సినిమా కూడా ఉంటుంది. ఇక ఉదయనిధి స్టాలిన్ కెరీర్‌లో తనకు దొరికిన బెస్ట్ రోల్ ఇదే అని చెప్పొచ్చు. కీర్తి సురేష్ నటనకు ఆస్కారమున్న పాత్రలో ఆకట్టుకుంది. మిగతా క్యారెక్టర్లందరూ తమ పరిధి మేర నటించారు.
సినిమాకు మరో మెయిన్ పిల్లర్ ఎ.ఆర్.రెహమాన్ సంగీతం. సాంగ్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఈశ్వర్ సినిమాటోగ్రఫీ కూడా ప్లస్ అయింది. ఇక ప్రొడ్యూసర్ ఉదయనిధే కాబట్టి కావాల్సినంత ఖర్చు పెట్టాడు.
చివరగా: ప్రేక్షకులకు సరికొత్త వడివేలుని చూపించే ‘నాయకుడు’
రేటింగ్: 3/5