న్యూఢిల్లీ (నేషనల్ డెస్క్)- కరోనా వైరస్ అంతకంతకు విస్తరిస్తోంది. కరోనా సోకినవారిలో రోగనిరోధక శక్తి ఉన్నావారు త్వరగా కోలుకుంటున్నారు. బలహీనంగా ఉన్న వారు కరోనాకు బలై పోతున్నారు. అందుకే ప్రత ఒక్కరు రోగనిరోధక శక్తిని పెంచుకోవాలని కేంద్ర ప్రభుత్వంతో పాటు, వైద్య నిపుణులు చెబుతున్నారు. మనిషి రోగనిరోధక శక్తి పెంపొందించుకునేందుకు కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ కీలకమైన సూచనలు చేసింది. కరోనా వైరస్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు శరీరంలోని సహజ రక్షణ వ్యవస్థ ను పెంచుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కరోనాను తగ్గించేందుకు ప్రస్తుతం మందులు లేని నేపథ్యంలో నివారణ ఒక్కటే మార్గమని వారు చెబుతున్నారు. మన రోజువారీ జీవితంలో కొన్ని ఇంటి చిట్కాలు పాటించడం ద్వారా ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడంతో పాటు, ఇమ్యునిటీ పవర్ ను పెంచుకోవచ్చని ఆయుష్ మంత్రిత్వ శాఖ పేర్కొంది. వాటిని పాటించి మీ రోగనిరోధక శక్తిని పెంచుకొని స్ట్రాంగ్ గా ఉండండి.
ప్రతి రోజు గోరు వెచ్చని నీళ్తు తాగాలి.
ప్రతి రోజూ యోగాసనాలు చేయాలి. కనీసం 30 నిమిషాలు ప్రణాయామం, సూర్య నమస్కారం వంటివి చేసినా పరవాలేదు.
ప్రతి రోజు ఆహారంలో పసుపు, జీలకర్ర, దనియాలు, వెల్లులి ఉండేలా చూసుకోవాలి.
ప్రతి రోజు ఉదయం సమయంలో 10 గ్రాముల చ్యావన్‌ప్రాష్ తినాలి. ఐతే మధుమేహం ఉన్న వారు సుగర్ ఫ్రీ చ్యావన్‌ప్రాష్ తీసుకోవాలి.
రోజూ తులసి, దాల్చిన చెక్క, నల్ల మిరియాలు, అల్లం, ఎండు ద్రాక్షతో తయారు చేసిన హెర్బల్ టీ తాగాలి. హెర్బల్ టీ రుచిగా ఉండాలంటే కాస్త బెల్లం, నిమ్మరసం కలుపుకోవచ్చు.
రోజులో ఒకటి, రెండుసార్లు 150 మిల్లీ లీటర్ల వేడి పాలల్లో అర టీ స్పూన్ పసుపు పొడి కలిపి తాగాలి.
ప్రతి రోజు ఉదయం, సాయంత్రం వేళ్లలో మీ ముక్కు రంథ్రాలకు నువ్వులు లేదా కొబ్బరి లేదా నెయ్యి రాయాలి.
ప్రతి రోజు ఒకటి లేదా రెండు సార్లు ఒక టేబుల్ స్పూన్ నువ్వుల నూనే లేదా కొబ్బరి నూనెను నోట్లో వేసుకుని పుక్కిలించాలి. ఐతే నూనెను తాగరాదు. 2 లేదా 3 నిమిషాలు పుక్కిలించిన తర్వాత నూనె బయటకు ఊసేసి.. వేడి నీటిలో నోరు శుభ్రం చేసుకోవాలి.
పొడి దగ్గు లేదా గొంతు నొప్పి ఎక్కువగా ఉంటే రోజుకు ఒకసారి నీటిలో పుదినా లేదా వాము వేసుకుని పీల్చాలి.
ఇక దగ్గు లేదా గొంతు గరగర ఎక్కువగా ఉంటే రోజుకు రెండు లేదా మూడు సార్లు లవంగాల పొడిలో తేనె కలుపుని తాగాలి.
ఆయుష్ మంత్రిత్వ శాఖ సూచించిన ఈ చిట్కాల వల్ల కేవలం రోగనిరోధక శక్తి మాత్రమే పెరుగుతుంది. కరోనా లక్షణాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా వైద్యులను సంప్రదించాలి.