భారత్ కి రూ.7300 కోట్ల భారీ విరాళం! ఎవరీ విటాలిక్ బుటెరిన్?

దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. అన్నీ వర్గాల ప్రజలు భయం, భయంగా కాలాన్ని వెళ్లదీస్తున్నారు. సరైన వైద్యాన్ని అందించడంలో గాని, కోవిడ్ నియంత్రణలో గాని ప్రభుత్వాలే చేతులు ఎత్తేయడంతో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా కుబేరులు కదలివస్తున్నారు. తమ సంపదలో భారీ మొత్తాలను విరాళంగా ప్రకటిస్తూ మంచి మనసు చాటుకుంటున్నారు. ఇండియాలో కరోనా వ్యాప్తిని నిరోధించే చర్యలకు మద్దతుగా నిలిచేందుకు ఎథెరియం పర్యావరణ వ్యవస్థ సహ వ్యవస్థాపకుడు విటాలిక్ బుటెరిన్ 1 బిలియన్ డాలర్స్ ని విరాళంగా ప్రకటించాడు. భారత కరెన్సీ లో ఈ మొత్తం సుమారు రూ.7,300 కోట్లు రూపాయలతో సమానం. కోవిడ్ నియంత్రణలో భాగంగా మన దేశానికి ఇప్పటి వరకు అందిన మొత్తంలో ఇదే పెద్ద విరాళం కావడం గమనార్హం. విటాలిక్ బుటెరిన్ ఒక రష్యన్-కెనడియన్ ప్రోగ్రామర్. అంతే కాక రచయిత కూడా. ఈయన ఎథెరియం సహ వ్యవస్థాపకులలోఒకరు. బుటెరిన్ క్రిప్టోకరెన్సీతో ప్రారంభంలోనే.. అనగా 2011 నుండే బిట్‌కాయిన్ మ్యాగజైన్‌తో సంబంధం కలిగి ఉన్నాడు. ఇక 2014 లో బుటెరిన్ ఎథెరియంను ప్రారంభించడంతో అయన జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ఇండియాలో వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రస్తుతం ఈ సాయం అత్యవసరమని విటాలిక్ బుటెరిన్ అభిప్రాయపడ్డారు. నా నిర్ణయం మరికొందరికి స్ఫూర్తి కలిగిస్తుందని భావిస్తున్నా, జీవితం చాలా చిన్నది కాబట్టి మనం ప్రజలకు చేయగలిగినదంతా ఈ రోజే చేసేద్దాం… అంటూ ఆయన పిలుపునిచ్చారు. విటాలిక్ బుటెరిన్ ఇంత భారీ విరాళం ప్రకటించడంతో నెటిజన్స్ ఆయనకి కృతజ్ఞతలు తెలియచేస్తున్నారు.