మధ్యధరా సముద్రంలో కూలిన యుద్దవిమానం.. సెర్చ్ ఆపరేషన్ లో బ్రిటీష్ నేవీ అధికారులు!

British F-35 fighter jet

మధ్యధరా సముద్రంలో ప్రమాదం చోటు చేసుకుంది. బ్రిటన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఎఫ్-35బి లైటెనింగ్ యుద్ధ విమానం కూలిపోయింది. అయితే ఈ ప్రమాదంలో మాత్రం పైలెట్ ముందుగా బయటపడ్డాడు. ప్రమాదం పొంచి ఉందని తెలియటంతో పైలెట్ ముందుగానే జాగ్రత్తపడి తన సీటుకున్న ఎజెక్ట్ బటన్ నొక్కి ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే ఈ ప్రమాదం జరిగిందని రష్యా నేవీ అధికారులు తెలుసుకునే లోపే బ్రిటీష్ నేవీ అధికారులు ప్రమాదం చోటు చేసుకున్న మధ్యధరా సముద్రంలోకి వాలిపోయారు.

అయితే కూలింది ఎఫ్-35బి లైటెనింగ్ యుద్ధ విమానం కావటం, దీని ఖరీదు భారత కరెన్సీలో చూసుకుంటే గనుక సుమారు రూ.1000 కోట్లు! ఉంటుందట. అయితే దీని కారణంగానే అత్యంత టెక్నాలజీని కలిగి ఉన్న ఎఫ్-35బి లైటెనింగ్ యుద్ధ విమానం శకలాలను ఏదీ కూడా వదలకుండా సేకరించేందుకు బ్రిటీష్ నేవీ సెర్చ్ ఆపరేషన్ ను మొదలు పెట్టింది. గుట్టుచప్పుడు కాకుండా సూపర్ సోనిక్ వేగంతో గగనతలంలో దూసుకెళ్లే ఈ యుద్ద విమానాన్ని అమెరికాకు చెందిన లాక్ హీడ్ సంస్థ అభివృద్ధి చేసింది. ఆకాశం నుంచి దాడులు చేయటానికి ఈ యుద్దవిమానాన్ని ఉపయోగిస్తారు. అయితే తాజాగా ఈ విమాన ప్రమాదంపై స్పందించారు బ్రిటన్ రక్షణశాఖ. హెచ్ఎంఎస్ క్వీన్ ఎలిజబెత్ పై నుంచి టేకాఫ్ తీసుకుంటున్న క్రమంలో అనూహ్యరీతిలోనే ఈ యుద్దవిమానం కూలిపోయిందంటూ బ్రిటన్ రక్షణశాఖ తెలిపింది.