Peddapalli: కొంతమంది వ్యక్తులు బంధాలు, బంధుత్వాలు మరుస్తున్నారు. డబ్బు కోసం, ఆస్తుల కోసం సొంత వాళ్లపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. అన్యాయానికి గురైన కొంతమంది సొంత వాళ్లపై పోరాటం చేయలేక వదిలేస్తుంటే.. మరికొంత మంది న్యాయ పోరాటానికి దిగుతున్నారు. ప్రాణాలకు తెగించైనా తమ ఆస్థిని దక్కించుకోవాలని భావిస్తున్నారు. తాజాగా, ఓ మహిళ తన రెండు ఎకరాల పొలం కోసం న్యాయ పోరాటం మొదలుపెట్టింది. ఏకంగా వాటర్ ట్యాంకు ఎక్కి నిరసనకు దిగింది. పొలం ఇప్పించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. ఈ సంఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటుచేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల మేరకు.. పెద్దపల్లి మండలం పాలితం గ్రామానికి చెందిన సువర్ణ అనే మహిళకు రెండు ఎకరాల భూమి ఉంది. ఆ భూమిపై ఆమె మరిది కన్ను పడింది.
ఎలాగైనా దక్కించుకోవాలని అతడు భావించాడు. ఇందుకోసం పావులు కదిపాడు. పక్కా ప్లాన్ ప్రకారం సువర్ణకు చెందిన రెండు ఎకరాల భూమిని కబ్జా చేశాడు. ఇదేంటని సువర్ణ ప్రశ్నిస్తే సరైన విధంగా స్పందించలేదు. అతడ్ని అడిగి, అడిగి ఆమె విసిగిపోయింది. ఇలా అయితే, కుదరదని భావించింది. శనివారం వాటర్ ట్యాంకు ఎక్కింది. తన రెండు ఎకరాల భూమిని తనకు ఇప్పించాలంటూ నిరసనకు దిగింది. వ్యాటర్ ట్యాంకుపై సువర్ణ నిరసనను అక్కడి వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆమెను కిందకు దింపే ప్రయత్నం చేశారు. తనకు న్యాయం జరిగితేనే కిందకు దిగుతానని ఆమె తేల్చిచెప్పింది. లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని అంది.