తెలంగాణ జనగామ జిల్లా సీఎం కేసీఆర్ పర్యటనలో అపశ్రుతి చోటు చేసుకుంది. సీఎం కేసీఆర్ కాన్వాయ్ వెళ్తుండగా.. కాన్వాయ్ నుంచి మహిళా కానిస్టేబుల్ జారి రోడ్డుపై పడ్డారు. ములుగు రోడ్డులో నిర్మించిన ప్రతిమ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ప్రారంభానికి ఇవాళ సీఎం కేసీఆర్ వెళ్లారు. ఉదయం క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ ని ప్రారంభించి.. హాస్పిటల్ ప్రతినిధులు, అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధుల సమావేశంలో పాల్గొనాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నుంచి కాన్వాయ్ లో బయలుదేరిన కేసీఆర్.. జనగామ జిల్లా, పెంబర్తి కళాతోరణం చేరుకున్నారు. అక్కడ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, స్థానిక నేతలు సీఎం కేసీఆర్ కు ఘన స్వాగతం పలికారు.
అనంతరం కేసీఆర్ కాన్వాయ్ అక్కడి నుంచి బయలుదేరింది. కాన్వాయ్ వెళ్తుండగా.. మహిళా కానిస్టేబుల్ కాన్వాయ్ నుంచి జారి పడ్డారు. అప్పటికే కాన్వాయ్ ముందుకు వెళ్ళింది. అయితే కాన్వాయ్ లో ఉన్న వాళ్ళు వెంటనే అలర్ట్ చేయడంతో వాహనం ఆగింది. తోటి పోలీసులు ఆమెకు సహాయం చేసేందుకు వచ్చేలోపు.. ఆ మహిళా కానిస్టేబుల్ తనకు తానుగా లేచి కాన్వాయ్ ఎక్కారు. ఈ ఘటనలో ఆమెకు స్వల్ప గాయాలు కాగా, మహిళా కానిస్టేబుల్ ని సమీప ఆస్పత్రికి తరలించారు.