హైదరాబాద్- తెలంగాణలో మే1 నుంచి 18 ఏళ్ల వయసు పైబడిన వారికి కొవిడ్ వ్యాక్సిన్ ఇవ్వలేమని ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. తెలంగాణ జనాభా అవసరాలకు సుమారు మూడు కోట్ల యాభై లక్షల వ్యాక్సిన్ డోసులు అవసరమని, దానిపై స్పష్టత లేకుండా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని అమలు చేయలేమని ఈటెల తేల్చిచెప్పారు. కేంద్రం నుంచి ఎంత కోటా వ్యాక్సిన్ వస్తుందో కూడా సమాచారం లేదన్నారు. కేంద్రం నుంచి అందే వ్యాక్సిన్ డోసులకు అనుగుణంగా తెలంగాణలో అమలు ఆధారపడి ఉంటుందన్నారు. కేంద్రం ఇచ్చిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం పాటిస్తుందని, అనేక సార్లు ప్రధాని వీడియో కాన్ఫరెన్స్లో సూచించిన అంశాలపై ప్రభుత్వం స్పందించిందని గుర్తు చేశారు. తెలంగాణపై కొంతమంది కేంద్ర పెద్దలు చేస్తున్న ఆరోపణలు అర్థ రహితమని ఈటెల కొట్టిపారేశారు. కేంద్రం ఇప్పటి వరకు కరోనా విషయంలో రాష్ట్రలకు పెద్దగా చేసింది ఎం లేదని విమర్శించారు.
వ్యాక్సిన్లు, ఇంజక్షన్లు అన్ని కేంద్రం చేతిలోనే పెట్టుకున్నారన్న ఈటెల.. కేంద్రం చేయాల్సిన తప్పులన్ని చేసి రాష్ట్రాలను నిందించడం సరికాదని మండిపడ్డారు. కేంద్రం చెప్పిన మాటల్లో వాస్తవాలు ఉంటే ఢిల్లీతో పాటు అనేక రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులపై సమాదానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కరోనా కేసులు, మరణాలపై తప్పుడు వార్తలు వస్తున్నాయని ఈటెల చెప్పారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్ఘడ్ రాష్ట్రాల నుండి తెలంగాణకు పెద్ద ఎత్తున జనాలు వస్తుంటారని, అందుకే ఇక్కడ కేసులు పెరుగుతున్నాయని అన్నారు. వచ్చే నెలలో కేసులు పెరిగే అవకాశం ఉన్నందున ఆక్సిజన్ 600 మెట్రిక్ టన్నులకు పెంచాలని కేంద్రన్ని కోరినట్లు ఈటెల తెలిపారు. రాష్ట్రాలలో నెలకొన్న విపత్కర పరిస్థితుల పట్ల కేంద్రమే బాధ్యతాయుతంగా ఉండాలని హితవుపలికారు. తెలంగాణలో 18 ఏళ్ళు పైబడిన యువకులు 1.7 కోట్ల మంది ఉన్నారని, వీళ్లకు రెండు డోసుల చొప్పున మూడు కోట్ల డోసులు అవసరం ఉన్నాయని చెప్పారు. వ్యాక్సిన్ విషయంలో కేంద్రం మరోసారి పునరాలోచించాలని ఈటెల రాజేందర్ కోరారు.