కాలం మారినా, ట్రెండ్ మారినా ఈటీవీ – సంవత్సరాల తరబడి పాడుతా తీయగా కార్యక్రమాన్ని నిర్వహిస్తోందంటేనే దీనికున్న ఆదరణ ఎలాటిందో అర్థం చేసుకోవచ్చు. ఈటీవీ వేదికగా 1996వ సంవత్సరంలో మొదలైన ఈ పాడుతా తీయగా ప్రోగ్రాం దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాలుగా అనేక మంది సింగర్స్ ను ఆయన సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసినట్లయింది. పాడుతా తీయగా అంటే బాల సుబ్రహ్మణ్యం – బాలసుబ్రహ్మణ్యం అంటే పాడుతా తీయగా అనేంత ప్రేక్షకులకు, సంగీత ప్రియులకు ఈ ప్రోగ్రాం కనెక్ట్ అయిపోయింది. ఎస్పీబీ … పాడటంతోనే పరిమితం కాక ఆయన నటుడిగా, సంగీత దర్శకుడిగా, హోస్ట్ గా అనేక అవతారాలు ఎత్తి ఎందులోనూ తక్కువ కాదు అని నిరూపించుకున్నారు. ఆయన గురించి ముఖ్యంగా చెప్పాలంటే పాడుతా తీయగా షో చేసి ఎంతోమందికి జీవితాన్ని ఇచ్చారు.
ఈ నేపథ్యంలోనే ఆయన అమితంగా ప్రేమించే ఈ పాడుతా తీయగా ప్రోగ్రాం మన ముందుకు తెచ్చేందుకు ఈటీవీ సంస్థ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం లాంటి మహామహుడు కూర్చున్న ప్లేస్ లో ఎవరిని కూర్చోబెట్టాలి అనే అంశం మీద కొద్ది రోజుల పాటు తర్జనభర్జనలు జరగగా చివరికి ఆ అంశం మీద కూడా ఒక క్లారిటీ వచ్చేసింది. ప్రోమో కూడా రిలీజయ్యింది. బాలసుబ్రహ్మణ్యం కుమారుడు ఎస్పీ చరణ్ కూర్చోబెట్టాలని రామోజీరావు డిసైడ్ అయ్యారు. చరణ్ కూడా తండ్రి వారసత్వాన్ని కొనసాగించడానికి తనదైన శైలిలో సంసిద్ధమయ్యారు. బాలు గారి మానస పుత్రికని ఆయన సుపుత్రుడు హోస్ట్ గా కమనీయ రూపకల్పన చేస్తున్నారు. ఎస్పీ చరణ్, సునీత, చంద్రబోస్ ముగ్గురు కలిసి రాబోయే పాడుతా తీయగా ఎపిసోడ్స్ లో అలరించబోతున్నారు. మరి ఆ స్వరరాగ గంగా ప్రవాహంలో మనమూ ఓలలాడేందుకు సిద్దమవుదాం… ఆ కార్యక్రమానికి మనసారా ఆశీర్వదిద్దాం.