స్పషల్ డెస్క్- బంగారం ధరలు ఎంతలా మండిపోతున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 10 గ్రాముల బంగారం సుమారు 50 వేల రూపాయలు పలుకుతోంది. సామాన్యులు కనీసం 10 గ్రాముల బంగారం కొనాలంటే పది సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. అలాంటిది ఓ ఇంటి గోడల నిర్మాణంలో ఏకంగా 560 కిలోల బంగారాన్ని వాడారంటే ఆశ్చర్యంగా అనిపించడం లేదు. ఆశ్చర్యం మాత్రమే కాదు.. అత్యంత అద్భుతం కూడా. మరి ఈ అరుదైన ప్యాలెస్ గురించి మరింతగా తెలుసుకోవాలని అనిపిస్తుంది కదా. అయితే సుమన్ టీవి ఫాలోవర్స్ కోసం బంగారు ప్యాలేస్ జై విలాస్ పై ప్రత్యేక కధనం ఇది.
దశాబ్ధాల రాచరిక చరిత్ర కూడా ఉన్న ఈ రాజ భవనాన్ని ప్రస్తుత మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జీవాజీరావు సింధియా హయాంలో నిర్మించారు. ప్రస్తుతం ఆయన మనుమడు, బీజేపీ ఎంపీ జ్యోతిరాదిత్య మాధవరావు సింధియా ఈ ప్యాలెస్ లోనే ఉంటున్నారు. గ్వాలియర్ రాజవంశంలో జన్మించిన జ్యోతిరాదిత్య ప్రస్తుత భారత రాజకీయాల్లో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. 1876లో బ్రిటీష్ పరిపాలనలో వేల్స్ యువరాజు జార్జ్, యువరాణి మేరీ భారత్‌కు వచ్చారట. వారిని గ్వాలియర్ కు ఆహ్వానించడం కోసం ఈ రాజభవనం.. జై విలాస్ ప్యాలెస్ నిర్మించారని చెబుతారు.
ఇక ఈ రాజభవనాన్ని మొత్తం మూడంతస్తుల్లో నిర్మించారు. మొదటి అంతస్తు టుస్కన్ స్టైల్లో, రెండో అంతస్తు ఇటాయిలన్ రిక్ స్టైల్లో, మూడో అంతస్తు కోరింథియన్ పలాడియన్ డిజైనుల్లో నిర్మించడం విశేషం. ఇక్కడి దర్బార్ హాల్‌లో భారీ షాండ్లియర్లను ఏర్పాటు చేశారు. ఒక్కో షాండ్లియర్ 250 బల్బులతో 3,500 కేజీల బరువు ఉంటాయి. ఇవి ఎంత భారీగా ఉంటాయంటే వీటిని భవనం పై కప్పు మోయగలదా అని చూడటం కోసం భవనాన్ని నిర్మించే సమయంలో ఎనిమిది ఏనుగులను సీలింగ్‌కు వేలాడదీసి పరీక్షించారట. జై విలాస్ ప్యాలెస్ హాల్ గోడలను 560 కేజీల బంగారంతో అలంకరించారు. నియోక్లాసికల్, బరాకీ స్టైల్ స్ఫూర్తితో ఈ హాల్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేశారు.
మహారాజు జయాజీరావవు సింధియా హయాంలో 1874 సంవత్సరంలో ఈ రాజభవనం పునాది పడింది. బ్రిటిష్ లెఫ్టినెంట్ కల్నల్ సర్ మైకేల్ ఫిలోస్ ఈ మ్యాన్షన్ డిజైన్ చేశారు. మొత్తం 12 లక్షల 40 వేల 771 చదరపు అడుగుల్లో విస్తరించి ఉన్న ఈ భవనాన్ని అప్పట్లోనే కోటి రూపాయలతో నిర్మించారు. ఇప్పటి లెక్కల ప్రకారం ఈ భవనం విలువ 10 వేల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ప్యాలెస్‌లో ఒక చిన్న మోడల్ రైలు కూడా ఉంది. దీన్నిపూర్తిగా వెండితో తయారు చేశారు. అప్పట్లో అతిథుల కోసం సిగార్లు, బ్రాందీ తీసుకురావడానికి ఈ రైలును ఉపయోగించేవారని చెబుతారు. ఇక ఈ జైవిలాస్ ప్యాలెస్ లో మొత్తం 400 గదులు ఉన్నాయి. వీటిలో 35 గదులను కలిపి ఓ ప్రత్యేకమైన మ్యూజియంగా మార్చారు. దీని పేరు హెచ్.హెచ్. మహారాజ జీవాజీరావు సింధియా మ్యూజియం. మరాఠా సింధియా రాజ వంశానికి చెందిన వెండి రధం, పల్లకీలు, వెండి బగ్గీలు, వింటేజ్ లగ్జరీ కార్లు వంటి ఆస్తులు ఈ మ్యూజియంలో కొలువుదీరాయి. సంవత్సరానికి ఒకసారి ఈ మ్యూజియాన్ని సందర్శించేందుకు అనుమతి ఇస్తారు.