ఓ జైల్లో ఖైదీల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో 68 మంది ప్రాణాలు కొల్పోగా మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన ఈక్వెడార్ దేశంలోని గ్వాయాక్విల్ నగరంలోని లిటోరల్ జైలులో చోటుచేసుకుంది. జైల్లోని రెండు ముఠాల మధ్య ఉన్న పాతకక్షల కారణంగా ఈ ఘర్షణ జరినట్లు సమాచారం. దాదాపు 900 మంది పోలీసులు ఎనిమిది గంటల పాటు శ్రమించి పరిస్థితిని అదుపులోకి తెచ్చినట్లు జైలు అధికారులు తెలిపారు.
అక్కడ పేలుడు పదార్థాలు, తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జైలు నుంచి భారీ పేలుడు శబ్ధాలు రావడంతో స్థానిక ప్రజలు భయాందోళనుకు గురైయ్యారు. ఎక్కువ సంఖ్యలో ఖైదీలు మరణించడంతో వారి బంధువులు జైలు వద్ద ఆందోళను చేశారు. మరికొందరి ఖైదీల బంధువులు తమవారి పరిస్థితి ఎలా ఉందో తెలపాలని అధికారులను నిలదీశారు. ఈ మారణహోమానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అంతర్జాతీయ మాదకద్రవ్యాల ముఠాకు చెందిన రెండు వర్గాల మధ్య ఈ ఘర్షణలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ ఘర్షణలో కొందరు ఖైదీలు జైలు గోడను డైనమైట్‌తో పేల్చేందుకు ప్రయత్నించినట్లు అధికారులు తెలిపారు. జైల్లోకి వెళ్లే సరకుల వాహనాలు, డ్రోన్ల ద్వారా ఆయుధాలు ఖైదీలకు చేరినట్లు అనుమానిస్తున్నారు. రెండు నెలల క్రితం ఈక్వెడార్‌లోని వివిధ కారాగారల్లోనూ ఇదే తరహాలోనే ఘర్షణలు తలెత్తగా.. 119 మంది ప్రాణాలు కోల్పోయారని సమాచారం.