ప్రపంచంలో కొన్ని సంఘటనలు ఎవరూ ఊహించని విధంగా చాలా విచిత్రంగా జరుగుతుంటాయి. అది కాకతాళీయమా.. మరో అద్భుతమా అనిపించవొచ్చు. తాజాగా ఓ దంపతులకు విషయంలో ఓ అద్భుతం జరిగింది.. ఐనవారందర్నీ కోల్పోయినా ఆ దంపతుల ముఖాల్లో మళ్లీ ఇప్పుడు చిరునవ్వులు విరబూస్తున్నాయి. 2019-సెప్టెంబరు 15.. ఏపీలోని భద్రాచలం దగ్గర విషాదం జరిగింది. వశిష్ట బోటు కచ్చులూరు సమీపంలో గోదావరి నదిలో మునిగిపోయింది. అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో విశాఖ ఆరిలోవకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన 11 మంది ఉన్నారు.
తలారి అప్పలరాజు తన తల్లితోపాటు ఇద్దరు కూతుళ్లు గీతావైష్ణవి, ధాత్రి అనన్యలను కూడా భద్రాచలం రాముడి దర్శనానికి పంపించారు. ఆ ప్రమాదంలో అప్పలరాజు తల్లితో సహా ఇద్దరు కూతుళ్లు కన్నుమూశారు. ఇద్దరు పిల్లలు పుట్టడంతో భార్య భాగ్యలక్ష్మికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించాడు అప్పలరాజు.. దాంతో తన భార్యకు సంతానం కలిగే భాగ్యం లేకి మళ్లీ కృంగిపోయాడు. ఇదే సమయంలో కృత్రిమ గర్భాధారణ ద్వారా పిల్లలు పుడతారని తెలుసుకొని విశాఖలో పద్మశ్రీ ఆస్పత్రిని గతేడాది సంప్రదించారు.
సరిగ్గా ప్రమాదం జరిన తేదీ సెప్టెంబరు 15నే ఆమె ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది. ఇది కాకతాళీయమా..! తెలియదు కానీ.. ఆ దేవుడిచ్చిన వరమంటూ మురిసిపోతున్న అప్పలరాజు దంపతులు. ద్దరు పిల్లల్ని కోల్పోయిన రోజునే.. తిరిగి ఇద్దరు కవలలకు జన్మనివ్వడం దేవుడి మహిమగానే భావిస్తున్నామన్నారు. ఆ ఇద్దరే మళ్లీ పుట్టారని..అందుకే వాళ్లకు గీతావైష్ణవి, ధాత్రి అనన్య పేర్లే పెడతామంటున్నారు దంపతులు.