‘కొల్లేరు’అంబాసిడర్‌గా గూడకొంగ కి అరుదైన గుర్తింపు..!

గూడ కొంగకు అరుదైన గుర్తింపు లభించింది. ఆంధ్రప్రదేశ్‌లోని కొల్లేరు సరస్సు అంబాసిడర్‌గా గూడకొంగ (పెలికాన్) ఎంపికైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొంగజాతుల్లో 40 శాతానికి పైగా గూడకొంగలు కొల్లేరులోనే ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న కొల్లేరుకు ప్రతి ఏటా దేశవిదేశాల నుంచి అనేక రకాల పక్షులు వలసొచ్చి సందర్శకులకు కనువిందు చేస్తుంటాయి.

asg minఒకప్పుడు ఇక్కడ స్వచ్ఛమైన నీరు ఉన్నా.. ప్రస్తుతం పలు ఆక్రమణలకు గురైంది.. కానీ పక్షుల రాక మాత్రం తగ్గలేదు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ (హెడ్ ఆఫ్ ది ఫారెస్ట్ ఫోర్సెస్) ఎన్. ప్రతీప్ ‌కుమార్ ఏపీ జీవవైవిధ్య మ్యాప్, గూడకొంగ లోగోను ఆవిష్కరించారు. గుంటూరులోని అటవీ శాఖ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో దీనికి సంబంధించిన పోస్టర్, లోగోను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగ ఆయన మాట్లాడుతూ కొల్లేరు సరస్సు అంబాసిడర్‌గా గూడకొంగను ఎంపిక చేసినట్టు తెలిపారు.

ksogsa minప్రపంచవ్యాప్తంగా ఉన్న గూడకొంగల్లో దాదాపు 40 శాతం కొల్లేరులోనే ఉన్నాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. చిత్తడి నేలల పరిరక్షణ అందరి బాధ్యత అన్న ప్రతీప్.. కొల్లేరు ప్రాంతంలో సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. కొల్లేరు సరస్సులోని సగం ప్రాంతం అభయారణ్యంగానూ, మరో సగం చిత్తడి నేలల ప్రాంతంగానూ ఉన్నట్టు పేర్కొన్నారు. రామ్ సర్ డిక్లరేషన్‌లో భాగంగా ప్రస్తుతం అభయారణ్యంగా, చిత్తడి నేలల ప్రాంతంగా కొల్లేరు సరస్సు ఎంపికైందని తెలిపారు. చిత్తడి నేలల పరిరక్షణ కోసం ప్రత్యేకంగా వెట్‌ల్యాండ్ మిత్రాస్‌ను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. స్థానికంగా సేవా దృక్పథం ఉన్నవారిని ఇందుకు ఎంపిక చేస్తామన్నారు. కార్యక్రమంలో డీఎఫ్‌ఓ సెల్వం తదితరులు పాల్గొన్నారు.