నాగశౌర్య, రీతూవర్మ జంటగా నటించిన “వరుడు కావలెను” మూవీ ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ లక్ష్మీ సౌజన్య మీడియాతో ముచ్చటించారు. నేను పుట్టింది కర్నూలు జిల్లాలో అయినా పెరిగిందంతా గుంటూరు జిల్లా నరసరావు పేట. మా నాన్న మ్యాథ్స్ లెక్చరర్. 11 ఏళ్లకే పదో తరగతి ఎగ్జామ్ రాశాను. చిన్నప్పటి నుంచి గుంపులో కలిసిపోవడం కాకుండా నలుగురిలో ఒకరిలా ఉండటం ఇష్టం. అందుకే సినిమా ఇండస్ట్రీ నాకు కరెక్ట్ అనిపించింది. ఇంట్లో పెళ్లి చేస్తానంటే వద్దని వారించి, పద్దెనిమిదేళ్ల వయసులో హైదరాబాద్ వచ్చేశాను.
తేజ, శేఖర్ కమ్ముల, కృష్ణవంశీ, ఆర్కా మీడియా, ప్రకాష్ కోవెలమూడి దగ్గర పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశాను. ‘వాంటెడ్’ తర్వాత దర్శకత్వ ప్రయత్నాలు మొదలుపెట్టాను. మొత్తానికి ఇండస్ట్రీలో 15 ఏళ్ల జర్నీ తర్వాత ఈ సినిమాతో డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ అవుతున్నాను. సినిమా మేకింగ్ లో నా ఇండివిడ్యువాలిటీ నాకుంది.
2017లో చినబాబు గారికి ఈ కథ చెప్పాను. స్టోరీ ఐడియా మొదలు అరగంట ఫుల్ నెరేషన్ వరకూ అంతా ఆయనకి నచ్చింది. అలా ఈ సినిమా మొదలైంది. ప్యాండమిక్ వల్ల రెండేళ్లు ఆలస్యమైంది. హారిక హాసిని క్రియేషన్స్ లాంటి పెద్ద బ్యానర్ లో నా లాంటి కొత్త డైరెక్టర్ కి అవకాశం రావడమే అదృష్టంగా భావిస్తున్నాను.
ఇందులో హీరోయిన్ క్యారెక్టర్ పేరు భూమి. పేరుకు తగ్గట్టే భూమికి ఉన్న అన్ని క్వాలిటీస్ ఉన్న అమ్మాయి. సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. ఎదుటివాళ్లని ఎంత రెస్పెక్ట్ చేస్తుందో వాళ్ల నుంచి అదే రెస్పెక్ట్ కోరుకుంటుంది. ఒకరిపై ఆధారపడదు. ఎవరినీ ఇబ్బంది పెట్టడు. అందుకే పర్యావరణానికి ఇబ్బంది లేని ఎకో ఫ్రెండ్లీ బిజినెస్ చేస్తుంది. అలాంటి అమ్మాయి ప్రేమించాలంటే తన కంటే ఆ అబ్బాయిలోనే ఎక్కువ క్వాలిటీస్ ఉండాలి. అవన్నీ నాగశౌర్యలో ఉన్నాయనిపించింది. ఫస్ట్ నుంచి హీరోగా నాగశౌర్యనే అనుకున్నానని దర్శకురాలు లక్ష్మీ సౌజన్య సినిమా విశేషాలను పంచుకున్నారు. మరి.. “వరుడు కావలెను” ఎలాంటి సక్సెస్ అందుకుంటుంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.